
కాకినాడలో తీవ్ర విషాదం.. పందులను కాల్చబోతే తూటా తగిలి బాలిక మృతి
ఈ వార్తాకథనం ఏంటి
కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. ఓ నాటు తుపాకీ గురితప్పి పేలిన కారణంగా నాలుగేళ్ల చిన్నారి దారుణంగా ప్రాణాలు కోల్పోయింది.
తుని మండలం వెలమ కొత్తూరులో పందులను చంపేందుకు కొందరు వ్యక్తులు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో ధన్యశ్రీ ఆకస్మికంగా మరణించింది.
మంగళవారం ఉదయం వెలమ కొత్తూరులో పెంపుడు పందులను వేటాడేందుకు గ్రామస్తులు నాటు తుపాకీని వినియోగించారు. ఈ విషయం తెలియని నాలుగేళ్ల పాప ఎప్పటిలాగే ఇంటి బయట పిల్లలతో ఆడుకుంటోంది.
ఈ నేపథ్యంలో తుపాకీ పేల్చడంతో గురితప్పి ధన్యశ్రీకి తగిలింది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
DETAILS
శోకసంద్రంలో చిన్నారి తల్లిదండ్రులు
విషయాన్ని తోటి స్నేహితులు వెంటనే బాధిత తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఘటనా స్థలానికి వచ్చిన తల్లిదండ్రులు, వెంటనే బాధిత చిన్నారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే మార్గ మధ్యలో ఆమె తుదిశ్వాస విడిచింది.
కూతురు ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వెలమకొత్తూరు గ్రామంలో విషాద పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అనంతరం నిందితులని అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నాటు తుపాకులను ఉపయోగించిన కారణంగా ఆయా సెక్షన్ల మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.