Guntur Medical College: ఒకే వైద్య కళాశాల నుంచి 8 మంది పద్మశ్రీలు.. గుంటూరు మెడికల్ కాలేజీ అరుదైన ఘనత
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా ఒక కుటుంబంలో ఇద్దరు ఐఏఎస్‌లు రావడం, ఒక గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంపిక కావడం వంటి ఘటనలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. కానీ ఒకే విద్యాసంస్థకు చెందిన ఎనిమిది మంది పూర్వ విద్యార్థులు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మశ్రీ అందుకోవడం మాత్రం అత్యంత అరుదైన విషయం. ఈ విశిష్ట ఘనతను గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల సొంతం చేసుకుంది. 1946లో స్థాపించబడిన గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల గత ఎనిమిది దశాబ్దాలుగా వైద్య, వైజ్ఞానిక రంగాలకు అనేక మంది ప్రతిభావంతులను అందిస్తోంది. ఇక్కడ చదువుకున్న పలువురు వైద్య నిపుణులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో విశిష్ట సేవలు అందిస్తున్నారు.
వివారాలు
పూర్వ విద్యార్థుల్లో ఎనిమిది మంది పద్మశ్రీ పురస్కారాలు
ఈ కళాశాల పూర్వ విద్యార్థుల్లో ఎనిమిది మంది పద్మశ్రీ పురస్కారాలు అందుకోవడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వారు డాక్టర్ సి.ఎం. హబీబుల్లా, డాక్టర్ బి. సోమరాజు, డాక్టర్ వై. నాయుడమ్మ, డాక్టర్ జి.ఎన్. రావు, డాక్టర్ డి. ప్రసాదరావు, డాక్టర్ ఎల్. నరేంద్రనాథ్, డాక్టర్ ఎం. గోపీచంద్, డాక్టర్ ఎ. గోపాలకృష్ణ గోఖలే.
వివరాలు
డాక్టర్ సి.ఎం. హబీబుల్లా
జీర్ణకోశ వ్యాధుల నిపుణుడిగా, మూలకణాల పరిశోధకుడిగా డాక్టర్ హబీబుల్లా విశేష సేవలు అందించారు. హైదరాబాద్‌లోని డెక్కన్ వైద్య విజ్ఞాన కళాశాలలో కాలేయ పరిశోధన, నిర్ధారణ కేంద్రం డైరెక్టర్‌గా పనిచేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య విద్యాశాఖ డైరెక్టర్ బాధ్యతలు నిర్వహించారు. 1997లో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోగా ఎంపికయ్యారు. అనేక వైద్య పరిశోధనా పత్రాలు ప్రచురించారు. అదే ఏడాది ఖ్వారిజ్మి అంతర్జాతీయ పురస్కారం అందుకున్నారు. 2001లో పద్మశ్రీ పురస్కారం లభించింది. 2010 జూలై 10న ఆయన కన్నుమూశారు.
వివారాలు
డాక్టర్ బి. సోమరాజు
గుండె వ్యాధుల నిపుణుడైన డాక్టర్ సోమరాజు హైదరాబాద్‌లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థలో గుండె వైద్య విభాగాధిపతిగా, డీన్‌గా పనిచేశారు. కేర్ ఆసుపత్రుల వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌గా గుర్తింపు పొందారు. 1998లో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్‌తో కలిసి తక్కువ ఖర్చుతో 'కలాం-రాజు కరోనరీ స్టెంట్'ను అభివృద్ధి చేశారు. వైద్య రంగంలో చేసిన సేవలకు గాను 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
వివరాలు
డాక్టర్ వై. నాయుడమ్మ
యార్లగడ్డ నాయుడమ్మ చిన్నారుల శస్త్రచికిత్స నిపుణుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారుల శస్త్రచికిత్స విభాగాధిపతిగా పనిచేశారు. తల, ఛాతీ, పొట్ట, నడుము భాగాల్లో కలిసిన ఐదు జంటల సయామీస్ కవలలను విజయవంతంగా విడదీసిన భారతీయ వైద్యుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2016లో పద్మశ్రీ పురస్కారం లభించింది.
వివరాలు
డాక్టర్ జి.ఎన్. రావు
గుల్లపల్లి నాగేశ్వరరావు నేత్ర వైద్య రంగంలో విశేష కృషి చేశారు. హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకుడిగా సేవలందించారు. అకాడెమియా ఆఫ్తల్మాలజికా ఇంటర్నేషనాలిస్ సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2017లో అమెరికా కంటి శస్త్రచికిత్స నిపుణుల సంఘం ఏర్పాటు చేసిన 'ఆఫ్తల్మాలజీ హాల్ ఆఫ్ ఫేమ్'లో స్థానం సంపాదించారు. 2002లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
వివరాలు
డాక్టర్ డి. ప్రసాదరావు
గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణుడైన డాక్టర్ ప్రసాదరావు ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనరీ బైపాస్ శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యుడిగా గుర్తింపు పొందారు. తక్కువ ఖర్చుతో ఆధునిక వైద్య సేవలు అందించడంలో ముందున్నారు. 1979లో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఉన్నత వైద్య విద్య పూర్తి చేశారు. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ దేశాల్లో ప్రత్యేక శిక్షణ పొందారు. 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
వివరాలు
డాక్టర్ ఎల్. నరేంద్రనాథ్
ఎముకల శస్త్రచికిత్స నిపుణుడైన డాక్టర్ నరేంద్రనాథ్ నిజాం వైద్య విజ్ఞాన సంస్థలో అసోసియేట్ డీన్‌గా, డైరెక్టర్‌గా పనిచేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌తో కలిసి పోలియో బాధితుల కోసం తేలికపాటి కృత్రిమ కాళ్ల తయారీ ప్రాజెక్టులో భాగస్వామ్యమయ్యారు. వైద్య రంగంలో చేసిన సేవలకు గాను 2005లో పద్మశ్రీ పురస్కారం పొందారు.
వివరాలు
డాక్టర్ ఎం. గోపీచంద్
గుండె శస్త్రచికిత్స రంగంలో డాక్టర్ గోపీచంద్ విశేష సేవలు అందించారు. ఇప్పటివరకు 50 వేలకుపైగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించారు. భారతదేశంలో కొట్టుకుంటున్న గుండెపై బైపాస్ శస్త్రచికిత్సలకు మార్గం సుగమం చేసిన వైద్యుల్లో ఆయన ఒకరు. హైదరాబాద్‌లో స్టార్ ఆసుపత్రుల వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తొలి రోబోటిక్ గుండె శస్త్రచికిత్స నిర్వహించిన ఘనత ఆయనకే దక్కింది. 2016లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
వివరాలు
డాక్టర్ ఎ. గోపాలకృష్ణ గోఖలే
తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా మనిషి నుంచి మనిషికి విజయవంతంగా గుండె మార్పిడి, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించిన వైద్యుడిగా డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గుర్తింపు పొందారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని పొదిల జింఖానా భవనంలో సేవా భావంతో 300కు పైగా ఉచిత గుండె శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2016లో పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇక పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న ప్రముఖ జీర్ణకోశ వైద్య నిపుణుడు డాక్టర్ నాగేశ్వరరెడ్డి కూడా గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలతో అనుబంధం కలిగిన కుటుంబానికి చెందినవారే కావడం విశేషం. ఆయన తండ్రి డాక్టర్ భాస్కరరెడ్డి ఈ కళాశాలలో పాథాలజీ ప్రొఫెసర్‌గా, ప్రిన్సిపల్‌గా పనిచేశారు.