IndiGo flight: గాల్లోనే మొరాయించిన ల్యాండింగ్ గేర్.. పూణేకు తిరిగొచ్చిన ఇండిగో విమానం
ఈ వార్తాకథనం ఏంటి
పూణే నుంచి గౌహతి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత ల్యాండింగ్ గేర్ లోపలికి ముడుచుకోకపోవడంతో విమాన సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. దీంతో విమానాన్ని తిరిగి పూణే విమానాశ్రయానికి మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేయాలని నిర్ణయించారు. ఈ ఘటనలో విమానంలో ఉన్న 192 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పూణే నుంచి గౌహతి వెళ్లేందుకు ఇండిగోకు చెందిన 6E 0623 విమానం బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక సమస్య గుర్తించారు.
వివరాలు
బే నంబర్ 7కు తరలింపు
ల్యాండింగ్ గేర్ లోపలికి వెళ్లకపోవడంతో విమానం ప్రయాణాన్ని కొనసాగించడం ప్రమాదకరమని భావించిన సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు.
దీంతో విమానాన్ని తిరిగి పూణే విమానాశ్రయానికి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.
విమానం సురక్షితంగా దిగేందుకు విమానాశ్రయ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.
ల్యాండింగ్‌కు ముందు విమానాన్ని రన్‌వేపై తక్కువ ఎత్తులో నడిపిస్తూ (లో పాస్) ల్యాండింగ్ గేర్ పరిస్థితిని పరిశీలించారు.
అనంతరం ఉదయం 9.04 గంటలకు విమానం ఎలాంటి ప్రమాదం లేకుండా రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది.
ముందస్తు జాగ్రత్తగా విమానాశ్రయంలో మూడు ఫైర్ ఇంజిన్లు, రెండు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు.
విమానం సురక్షితంగా దిగిన తర్వాత దానిని బే నంబర్ 7కు తరలించారు. ఉదయం 9.10 గంటలకు అత్యవసర పరిస్థితిని ఉపసంహరించారు.
వివరాలు
విమాన సిబ్బంది,విమానాశ్రయ అధికారుల సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం
మరోవైపు, గౌహతికి వెళ్లాల్సిన ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది.
ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు బెంగళూరు నుంచి మరో విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.
విమాన సిబ్బంది, విమానాశ్రయ అధికారులు సమయస్ఫూర్తితో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు విచారణ ప్రారంభించారు.