G.V. Raja Stadium: ఒలింపిక్స్ లక్ష్యంగా జీవీ రాజా స్టేడియం.. రూ.100 కోట్లతో అభివృద్ధి
ఈ వార్తాకథనం ఏంటి
కేరళ రాజధాని తిరువనంతపురంలోని చారిత్రక జీవీ రాజా స్టేడియానికి మహర్దశ పట్టనుంది. దాదాపు తొమ్మిది దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించి, ఒలింపిక్స్ స్థాయి క్రీడా పోటీలకు అనువుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపీ ఈ విషయంలో చొరవ తీసుకున్నారు. ఇందుకోసం సుమారు రూ.100 కోట్లతో భారీ అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఈ అంశంపై కేరళ యూనివర్సిటీ ఉన్నతాధికారులతో ఆయన ఇప్పటికే చర్చలు జరిపారు.
వివరాలు
స్టేడియాన్ని పరిశీలించిన సురేశ్ గోపీ
సురేశ్ గోపీ ఇటీవల జీవీ రాజా స్టేడియాన్ని సందర్శించారు.
ఆయన వెంట కేరళ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ డాక్టర్ మోహనన్ కున్నుమ్మల్, యూనివర్సిటీ సిండికేట్ ఫైనాన్స్ సభ్యుడు ఆర్.ఎస్. శశికుమార్ ఉన్నారు.
స్టేడియం నిర్వహణ, యాజమాన్య బాధ్యతలు కేరళ యూనివర్సిటీ పరిధిలోనే ఉన్నాయి.
ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉందని సురేశ్ గోపీ వెల్లడించినట్లు ఆర్.ఎస్. శశికుమార్ తెలిపారు.
త్వరలోనే కేరళ యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్టేడియం అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌తో పాటు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) రూపొందించనున్నట్లు చెప్పారు.
ప్రతిపాదిత ప్రణాళిక అమలైతే జీవీ రాజా స్టేడియం ప్రపంచ స్థాయి క్రీడా కేంద్రంగా మారుతుందన్న ఆశాభావాన్ని సురేశ్ గోపీ వ్యక్తం చేసినట్లు శశికుమార్ పేర్కొన్నారు.
వివరాలు
2036 ఒలింపిక్స్ నేపథ్యంలో ప్రాధాన్యం
2036 సమ్మర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలని భారత్ గట్టిగా ప్రయత్నిస్తున్న సమయంలో జీవీ రాజా స్టేడియం అభివృద్ధి ప్రతిపాదన తెరపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఒలింపిక్స్ నిర్వహణ కోసం అహ్మదాబాద్‌ను ప్రధాన వేదికగా భారత్ ప్రతిపాదించినప్పటికీ, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ వివిధ క్రీడా వేదికలను అంతర్జాతీయ స్థాయిలో సిద్ధం చేయాల్సిన అవసరం ఉంటుంది.
ఈ నేపథ్యంలో తిరువనంతపురంలోని జీవీ రాజా స్టేడియాన్ని కూడా 2036 ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ పోటీలకు ఉపయోగపడే ముఖ్యమైన వేదికగా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాలు
గతంలో వన్డే మ్యాచ్‌కు ఆతిథ్యం
జీవీ రాజా స్టేడియానికి గతంలో అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన ఘనత ఉంది.
అయితే కొన్నేళ్లుగా సరైన నిర్వహణ లేకపోవడంతో స్టేడియం పరిస్థితి క్రమంగా దిగజారింది.
ముఖ్యంగా సింథటిక్ ట్రాక్‌తో పాటు క్రీడాకారులకు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయి.
దీంతో ప్రస్తుతం స్టేడియం శిథిలావస్థకు చేరుకుంది. 1937లో ట్రావెన్‌కోర్ యూనివర్సిటీలో భాగంగా నిర్మించిన ఈ స్టేడియం త్వరలోనే దాదాపు 90 ఏళ్ల చరిత్రను పూర్తి చేసుకోనుంది.
కేరళ క్రీడారంగ పితామహుడిగా గుర్తింపు పొందిన కల్నల్ గోదవరం రాజా పేరు మీద దీనికి జీవీ రాజా స్టేడియంగా నామకరణం చేశారు.
వివరాలు
కేరళ క్రీడారంగ పితామహుడిగా కల్నల్ గోదవరం రాజా
కేరళలో అథ్లెటిక్స్, క్రికెట్, ఫుట్‌బాల్ క్రీడలకు ఆదరణ పెరగడంలో కల్నల్ గోదవరం రాజా కీలక పాత్ర పోషించారు.
ఈ క్రీడలను రాష్ట్రంలో విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఆయన చేసిన కృషి కారణంగానే ఆయనను కేరళ క్రీడారంగ పితామహుడిగా పిలుస్తారు.
ఇప్పుడు రూ.100 కోట్ల అభివృద్ధి ప్రణాళిక కార్యరూపం దాల్చితే, చారిత్రక జీవీ రాజా స్టేడియం కొత్త రూపు సంతరించుకోవడమే కాకుండా అంతర్జాతీయ క్రీడా వేదికగా ఎదిగే అవకాశం ఉంది.