జ్ఞానవాపి మసీదులో సర్వేపై ఆగస్టు 3న తీర్పును రిజర్వ్ చేసిన అలహాబాద్ హైకోర్టు
వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేకు సంబంధించిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు గురువారం తీర్పును రిజర్వ్ చేసింది. ఆగస్టు 3న కోర్టు తీర్పును వెలువరించనుంది. ఈ సర్వేపై స్టే విధించాలంటూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈమేరకు బుధవారం, గురువారం మసీదు కమిటీతో పాటు హిందూ పక్షాల వాదనలను హైకోర్టు విన్నది. ఇదే సమయంలో సర్వే తీరుపై ఏఎస్ఐ అదనపు డైరెక్టర్ అఫిడవిట్ జారీ చేశారు. సర్వే వల్ల భవనానికి ఎలాంటి నష్టం వాటిల్లదని చెప్పారు. ఏ నిర్మాణమూ తొలగించబడదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మసీదు వ్యవహారంలో తీర్పు వచ్చేవరకు సర్వేను చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.