Hyderabad: పట్టాలెక్కిన హెచ్-సిటీ.. ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు
ఈ వార్తాకథనం ఏంటి
ట్రాఫిక్ సిగ్నళ్లు లేని రహదారి వ్యవస్థను లక్ష్యంగా రూపొందించిన హెచ్-సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) ప్రాజెక్టుకు ఎట్టకేలకు కదలిక వచ్చింది. మొత్తం రూ.3,290 కోట్ల విలువైన పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టు ప్రణాళికల్లో మార్పులు చేయడం, అంచనా వ్యయాల్లో సర్దుబాటు, భూసేకరణ ప్రతిపాదనల రూపకల్పనతో పాటు అన్ని పరిపాలనా ప్రక్రియలు పూర్తికావడంతో ఒక్కో ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది.
Details
ప్రధాన సవాళ్లు
ఏఓసీ, రేతిబౌలి ప్రాంతాల్లోని రక్షణశాఖ భూములు, ఉప్పల్ చౌరస్తాలోని సర్వే ఆఫ్ ఇండియా భూములు, ఇతర ప్రాజెక్టుల కోసం మరో రెండు వేల ఆస్తుల సేకరణ జీహెచ్‌ఎంసీకి పెద్ద సవాలుగా మారింది. భూస్వాములకు నగదు బదులుగా టీడీఆర్ (ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు.
Details
ఇప్పటికే మొదలైన పనులు
కేబీఆర్ పార్కు చుట్టూ ప్యాకేజీ-1 కింద రూ.580 కోట్లతో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ కూడలి, కేబీఆర్ పార్కు చౌరస్తా, ముగ్ధా జంక్షన్‌ల వద్ద స్టీలు బ్రిడ్జులు, అండర్‌పాస్‌ల నిర్మాణం ప్రారంభమైంది. ప్యాకేజీ-2 కింద రూ.510 కోట్లతో రోడ్డు నెం.45, ఫిల్మ్‌నగర్ కూడలి, మహారాజ అగ్రసేన్ కూడలి, క్యాన్సర్ ఆస్పత్రి కూడలిలో స్టీలు బ్రిడ్జులు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి మల్కాజిగిరి తదితర ప్రాంతాలను కలిపే ఏఓసీ ప్రాంతంలో 'డీ' ఆకారంలో రూ.960 కోట్లతో ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణం, అలాగే రూ.210 కోట్లతో ఆర్కేపురం ఆర్వోబీ నిర్మాణం ప్రతిపాదించగా, ఇవి ప్రస్తుతం టెండరు దశలో ఉన్నాయి.
Details
150 అడుగుల వెడల్పుతో రోడ్డు విస్తరణ పనులు
రూ.749 కోట్లతో గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ కూడలిలో పైవంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణం, గచ్చిబౌలి కూడలి నుంచి సైబరాబాద్ కమిషనరేట్ వరకు 215 అడుగుల వెడల్పుతో రహదారి విస్తరణ, అంజయ్యనగర్ నుంచి రాంకీటవర్ వరకు 150 అడుగుల వెడల్పుతో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. రూ.56 కోట్లతో ఫాక్స్‌సాగర్ నాలాపై స్టీలు బ్రిడ్జి నిర్మాణానికి పునాది పనులు కొనసాగుతున్నాయి.
Details
ప్రాజెక్టు వివరాలు ఇవే
మొత్తం పనులు: 55 మొత్తం అంచనా వ్యయం: రూ.7,000 కోట్లు ఇప్పటివరకు ప్రారంభమైన పనులు: 29 గుత్తేదారు ఒప్పంద దశలో ఉన్నవి: 11 టెండరు దశలో ఉన్నవి: 10 టెండరు నిర్వహించాల్సినవి: 5