Loading...
Metro Acquisition: హైదరాబాద్‌ మెట్రో స్వాధీనానికి బ్రేక్‌.. రుణ సేకరణలో జాప్యం
హైదరాబాద్‌ మెట్రో స్వాధీనానికి బ్రేక్‌.. రుణ సేకరణలో జాప్యం

Metro Acquisition: హైదరాబాద్‌ మెట్రో స్వాధీనానికి బ్రేక్‌.. రుణ సేకరణలో జాప్యం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2026
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ మెట్రోరైలు మొదటిదశ స్వాధీన ప్రక్రియను సెప్టెంబరు 30లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. రుణ సేకరణ ప్రక్రియ ఇంకా కొలిక్కి రాకపోవడంతో మరింత ఆలస్యం కానుంది. దీంతో షేర్‌ పర్చేస్‌ అగ్రిమెంట్‌ (ఎస్‌పీఏ) పూర్తి కావడానికి మరో మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. అయితే తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు సంస్థలు ముందుకొస్తే.. అక్టోబరులోనే సంబంధిత ప్రక్రియను పూర్తి చేయగలమనే ధీమాను మెట్రోరైలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మెట్రోరైలు తొలిదశ స్వాధీనానికి అవసరమైన రూ.13,600 కోట్ల రుణాన్ని సమీకరించే బాధ్యతను ప్రభుత్వం ఎస్‌బీఐ క్యాప్స్‌కు అప్పగించింది. ఈ ప్రక్రియను రెండు నెలల్లోగా పూర్తి చేయాలని సూచించింది. అయితే ఇప్పటికే నెల రోజులకు పైగా గడిచింది.

వివరాలు

ఐఆర్‌ఎఫ్‌సీతోనూ సంప్రదింపులు

నాలుగు శాతం కంటే తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే సంస్థల కోసం ఎస్‌బీఐ క్యాప్స్‌ అన్వేషణ కొనసాగిస్తోంది.

ఈ నెలాఖరులోగా రుణ సేకరణ ప్రక్రియ పూర్తవడం కష్టమేనని మెట్రో అధికారులు భావిస్తున్నారు. అయితే అక్టోబరులో మాత్రం రుణ సేకరణ ప్రక్రియ పూర్తవుతుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ఎస్‌బీఐ క్యాప్స్‌ కొత్త రుణ సంస్థ కోసం అన్వేషణ కొనసాగిస్తుండగా.. మెట్రోరైలు అధికారులు గతంలో రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ)తోనూ సంప్రదింపులు జరుపుతున్నారు.

మెట్రోరైలు స్వాధీనానికి అవసరమైన రూ.13,527 కోట్ల రుణాన్ని అందించేందుకు ఐఆర్‌ఎఫ్‌సీ తొలుత ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. అయితే ఆ తర్వాత రుణ ప్రక్రియ నిలిచిపోయింది.

వివరాలు

ఒప్పందం ఇలా..

హైదరాబాద్‌ మెట్రోరైలు మొదటిదశలోని ఎల్‌ అండ్‌ టీ వాటాను ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఈ ఏడాది ఏప్రిల్‌ 29న షేర్‌ పర్చేస్‌ అగ్రిమెంట్‌ (ఎస్‌పీఏ)కుదిరింది.

ఇందులో రూ.1,461.47కోట్లతో ఈక్విటీని కొనుగోలు చేసేందుకు ఒప్పందం జరిగింది. అప్పటి నుంచి మెట్రోరైలు రుణాలపై వడ్డీభారం ప్రభుత్వంపైనే పడుతోంది.

ఈ ప్రక్రియ జూన్‌ 30 నాటికి పూర్తవుతుందని ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు లిమిటెడ్‌ సెబీకి సమాచారం ఇచ్చింది. అయితే రుణం ఆగిపోవడంతో ప్రక్రియ పూర్తికి సెప్టెంబరు 30వరకు గడువు ఉంటుందని మరోసారి సెబీ దృష్టికి తీసుకెళ్లింది.

ప్రస్తుతం సెప్టెంబరు 30లోగా కూడా ప్రక్రియ పూర్తయ్యే పరిస్థితి లేదని మెట్రో అధికారులు చెబుతున్నారు. దీంతో మరో మూడు నెలల పాటు గడువు పొడిగింపు అనివార్యంగా మారింది.

ADVERTISEMENT

వివరాలు

రోజుకు రూ.2.5 కోట్ల వడ్డీ భారం

మరోవైపు ఎల్‌ అండ్‌ టీతో ఒప్పందం కుదిరిన రోజు నుంచి మెట్రోరైలు రుణాలపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది.

ప్రస్తుతం రుణాలపై రోజుకు రూ.2.5 కోట్ల చొప్పున వడ్డీ చెల్లించాల్సి వస్తోంది.

అయితే 4 శాతం లోపు వడ్డీకి రుణాలు లభిస్తే, ప్రస్తుతం ఉన్న వడ్డీభారం సగానికి సగం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

తద్వారా మెట్రోరైలు లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ADVERTISEMENT