Happy Sunday: రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ ప్రారంభం కానున్న 'హ్యాపీ సండే' కార్యక్రమం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రజల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఆనందాన్ని పంచే లక్ష్యంతో రూపొందించిన 'హ్యాపీ సండే' కార్యక్రమం ఏపీ వ్యాప్తంగా మళ్లీ అమలులోకి రానుంది. ఇకపై ప్రతి నెలలో రెండో, నాలుగో ఆదివారాల్లో రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి మార్గదర్శకాలను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్‌కుమార్ గురువారం విడుదల చేశారు. 2014 నుంచి 2019 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన 'హ్యాపీ సండే' కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని నిలిపివేశారు.
వివరాలు
ఫీజు లేదు...ఆనందమే హద్దు
తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రతి నెలలో 2వ,4వ ఆదివారాల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్థానిక అవసరాలు, పరిస్థితులను బట్టి ఈ సమయాల్లో స్వల్ప మార్పులు చేసుకునే వెసులుబాటు అధికారులకు కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. ఈ నెల 22వ తేదీన తొలి 'హ్యాపీ సండే' కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో ఒకేసారి నిర్వహించనున్నారు.
వివరాలు
కార్యక్రమం లక్ష్యాలివి...!
యోగా, ధ్యానం, వాకింగ్, సైక్లింగ్ వంటి కార్యకలాపాల ద్వారా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం. ఆటలు, కథనాలు, చిత్రలేఖనం వంటి పోటీలను నిర్వహించి పిల్లలు, యువతను చురుకుగా పాల్గొనించేలా చేయడం. మొక్కలు నాటడం, వీధులు శుభ్రపరిచే కార్యక్రమాల ద్వారా పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించడం. సంగీతం, నృత్యం, వివిధ కళా ప్రదర్శనలతో ప్రజల్లో ఉత్సాహం, సృజనాత్మకతను ప్రోత్సహించడం. తేలికపాటి వ్యాయామాలు, వినోద కార్యక్రమాల ద్వారా వృద్ధులను కూడా చురుకుగా పాల్గొనేలా చేయడం.