Sonia Gandhi's 'Belonging' : పెంగ్విన్ స్థానంలో హార్పర్‌కాలిన్స్.. సోనియా గాంధీ పుస్తకానికి కొత్త ప్రచురణకర్త
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకానికి భారత్‌లో కొత్త ప్రచురణకర్త వచ్చారు. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా స్థానంలో హార్పర్‌కాలిన్స్ ఇండియా ఈ పుస్తకాన్ని ప్రచురించనుంది. ఈ విషయాన్ని హార్పర్‌కాలిన్స్ శుక్రవారం వెల్లడించింది. సోనియా గాంధీ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జ్ఞాపకాల పుస్తకాన్ని భారత్‌లో 2026 నవంబర్ 10న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ప్రేమ, గుర్తింపు, బాధ్యత, అనుబంధం వంటి అంశాలతో పాటు భారతదేశ ప్రయాణాన్ని తన వ్యక్తిగత అనుభవాల ద్వారా ఈ పుస్తకం పరిచయం చేస్తుందని పేర్కొంది.
వివరాలు
'బిలాంగింగ్' పుస్తకానికి ప్రచురణకర్త కాదని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ప్రకటించింది
ఇటీవల పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా తాము సోనియా గాంధీ 'బిలాంగింగ్' పుస్తకానికి ప్రచురణకర్త కాదని ప్రకటించింది.
పుస్తకంలోని కొన్ని అంశాలపై సంపాదకీయ మార్పులకు సోనియా గాంధీ అంగీకరించకపోవడంతో ప్రచురణ సంస్థ వెనక్కి తగ్గిందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
అయితే ఈ కారణంతోనే పుస్తకాన్ని ప్రచురించకూడదని నిర్ణయించుకున్నట్లు వచ్చిన వార్తలను పెంగ్విన్ ఖండించింది.
పుస్తకాన్ని ప్రచురించేందుకు తాము ఆసక్తిగా, సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హార్పర్‌కాలిన్స్ చేసిన ట్వీట్
HarperCollins India will publish Belonging: A Journey of Love by Sonia Gandhi. The long-awaited memoir will be published in India on 10 November 2026.
— HarperCollins (@HarperCollinsIN) September 4, 2026
One of the most anticipated political memoirs of our time, Belonging is a dramatic and deeply personal story of love, identity,… pic.twitter.com/cNWuNRgXXP
వివరాలు
సోనియా గాంధీతో చర్చలు
రచయితలు రాసిన విషయాలను వాస్తవాలతో సరిపోల్చి చూడటం, అవసరమైన సూచనలు ఇవ్వడం ప్రచురణ ప్రక్రియలో సాధారణమైన విషయమేనని పెంగ్విన్ తెలిపింది.
సోనియా గాంధీతో జరిగిన చర్చలు గోప్యమైనవని, వాటి గురించి మరింత వివరాలు వెల్లడించబోమని పేర్కొంది.
అనంతరం సోమవారం మరో ప్రకటన విడుదల చేసిన సంస్థ.. తన నిర్ణయం వెనుక ఎలాంటి బాహ్య ఒత్తిడి లేదని స్పష్టం చేసింది.
పుస్తకానికి సంబంధించిన చర్చల్లో ఓ నిర్దిష్ట అంశంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రతిష్ఠంభన ఏర్పడిందని తెలిపింది.
అయితే ఆ అంశం ఏమిటన్నది రచయితతో ఉన్న గోప్యతా ఒప్పందం కారణంగా వెల్లడించలేదు.
వివరాలు
హార్పర్‌కాలిన్స్ ఇండియా ప్రకటనతో స్పష్టత
అమెరికాకు చెందిన ప్రముఖ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్‌లోని అల్ఫ్రెడ్ ఏ. నాఫ్ ఇప్పటికే 'బిలాంగింగ్' పుస్తకాన్ని నవంబర్ 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
దీంతో భారత్‌లో ఈ పుస్తకాన్ని ఎవరు ప్రచురిస్తారనే దానిపై కొంతకాలంగా ఆసక్తి నెలకొంది.
తాజాగా హార్పర్‌కాలిన్స్ ఇండియా ప్రకటనతో దీనిపై స్పష్టత వచ్చింది.
తన కుటుంబం గురించి ఎన్నో కథనాలు ప్రచురితమైనప్పటికీ.. వారి నిర్ణయాలు, చర్యలు, మానవ సహజమైన లోపాల వెనుక ఉన్న నిజాలను పూర్తిగా ఆవిష్కరించిన కథనాలు చాలా తక్కువగా ఉన్నాయని సోనియా గాంధీ గతంలో పేర్కొన్నారు.
ఈ పుస్తకం వారి మానవత్వానికి ఒక నివాళి వంటిదని తెలిపారు. తాను ఆరు దశాబ్దాలుగా చూస్తున్న సామాజిక, రాజకీయ మార్పులను కూడా ఇందులో వివరించినట్లు చెప్పారు.
వివరాలు
ఇందిరా గాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి బాధ్యతలు
'బిలాంగింగ్'లో 79 ఏళ్ల సోనియా గాంధీ తన జీవితంలో చోటుచేసుకున్న కీలక పరిణామాలను వివరించారు.
1984లో తన అత్త, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు గురైన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని ఆమె పేర్కొన్నారు.
అనంతరం రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టారు. అయితే 1991లో రాజీవ్ గాంధీ కూడా హత్యకు గురికావడంతో ఆమె జీవితంలో మరో విషాదం చోటుచేసుకుంది.
తర్వాత సోనియా గాంధీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక కాలం అధ్యక్షురాలిగా కొనసాగారు.
వివరాలు
2014లో కేంద్రంలో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్
పార్టీ నుంచి ప్రధానమంత్రి పదవి చేపట్టాలని అవకాశం వచ్చినప్పటికీ ఆమె దాన్ని తిరస్కరించారు.
2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని భాజపా అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ కేంద్రంలో అధికారాన్ని కోల్పోయింది.
తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో గోప్యంగా ఉంచుకున్న తాను.. వరుసగా ఎదురైన బాధలు, నష్టాల కారణంగానే ప్రజా జీవితంలోకి, రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సి వచ్చిందని సోనియా గాంధీ తెలిపారు.