Loading...
Tukaram Mundhe: తుకారాం ముండేపై హర్ష్ గొయెంకా ప్రశంసలు.. ఐఏఎస్ అధికారి రియాక్షన్ ఇదే!
తుకారాం ముండేపై హర్ష్ గొయెంకా ప్రశంసలు.. ఐఏఎస్ అధికారి రియాక్షన్ ఇదే!

Tukaram Mundhe: తుకారాం ముండేపై హర్ష్ గొయెంకా ప్రశంసలు.. ఐఏఎస్ అధికారి రియాక్షన్ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 31, 2026
12:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమిషనర్ తుకారాం ముండే తన విధి నిర్వహణతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఆహార కల్తీ, అసురక్షిత వంటశాలలపై కఠిన చర్యలు తీసుకుంటూ తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గొయెంకా సైతం ఆయన సేవలను కొనియాడారు. దీనికి తుకారాం ముండే ఎంతో వినయంగా స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల ఓ కార్యక్రమంలో తుకారాం ముండేను తొలిసారి కలిసిన విషయాన్ని హర్ష్ గొయెంకా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ ప్రశంసలు కురిపించారు.

వివరాలు

ప్రజల హృదయాల్లో హీరోగా నిలుస్తారు

''తొలిసారి తుకారాం ముండేను కలిశాను. ఆ కార్యక్రమంలో ఆయనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆయన్ను కలవాలని ఆసక్తి చూపించారు. అధికారుల నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారో.. తుకారాం అదే చేస్తున్నారు.

ఆహార కల్తీ, అపరిశుభ్రమైన వంటశాలలపై కఠిన చర్యలు తీసుకుంటూ శక్తిమంతమైన వ్యవస్థలను సైతం ఎదుర్కొంటున్నారు.

ఒక అధికారి తన విధులను నిజాయతీ, నిబద్ధతతో నిర్వర్తిస్తే ప్రజల హృదయాల్లో హీరోగా నిలుస్తారని చెప్పడానికి తుకారాం ముండే ఒక ఉదాహరణ.

అయితే ఇలాంటి ఉదాహరణలు చాలా అరుదుగా కనిపిస్తున్నప్పుడు.. విస్తృతమైన సివిల్ సర్వీస్ రంగంలో ఇవి ఎంతవరకు ప్రభావం చూపగలవు? అని హర్ష్ గొయెంకా తన పోస్టులో పేర్కొన్నారు.

వివరాలు

ఇతరులకు ఆదర్శంగా నిలవడం హర్షణీయం

హర్ష్ గొయెంకా ప్రశంసలకు తుకారాం ముండే కూడా స్పందించారు. ప్రజాసేవ అనేది ఎప్పుడూ ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించిన విషయం కాదని, ధైర్యం, నిజాయతీతో సాగించే సమష్టి ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు తమ పనితీరుతో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు.

వారిలో నేను కూడా ఒక భాగం మాత్రమే. నాకంటే మెరుగ్గా పనిచేసేవారు ఎంతోమంది ఉన్నారు. అయితే వారికి చాలా అరుదుగానే గుర్తింపు లభిస్తోంది.

ప్రజల నమ్మకం, వారి అంచనాలే మాకు ఉన్న అతిపెద్ద బాధ్యత. నిజాయతీతో, బాధ్యతాయుతంగా ప్రజలకు సేవ చేయడం అనేది సాధారణ విషయంగా మారాలి.

అది ఒక మినహాయింపుగా మిగిలిపోకూడదు'' అని తుకారాం ముండే తన సమాధానంలో పేర్కొన్నారు.

ADVERTISEMENT