Haryana polls: వృద్ధులు, వితంతువులు,వికలాంగులకు రూ.6వేల పెన్షన్.. ఏడు గ్యారంటీలతో హర్యానాలో కాంగ్రెస్ మేనిఫెస్టో
హర్యానా అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బుధవారం మేనిఫెస్టోను విడుదల చేసింది. "సాత్ వాదే, పక్కే ఇరదే" పేరుతో రూపొందించిన ఈ మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో హర్యానా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ 7 ప్రధాన హామీలను ప్రకటించింది.ఈ మేనిఫెస్టో ప్రకారం,కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, 18నుంచి 60ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలకు ప్రతి నెలా రూ.2000 అందజేస్తామని పేర్కొంది. రూ.500కు గ్యాస్ సిలిండర్ ఇవ్వడంతో పాటు,వృద్ధులు,వితంతువులు,వికలాంగులకు రూ.6000 పెన్షన్ అందజేస్తామని హామీ ఇచ్చింది. ఎంఎస్‌పీ గ్యారెంటీ చట్టం,300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కూడా ముఖ్యమైన వాగ్దానాల్లో ఉన్నాయి.
బీజేపీ పాలనలో హర్యానా నేరాల కేంద్రంగా మారింది
అదనంగా, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని, పేదలకు 100 గజాల ఉచిత ప్లాట్లు ఇస్తామని పేర్కొన్నారు. కుల గణన కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేర్చుతామని, మరిన్ని వాగ్దానాలను చండీగఢ్‌లో ప్రకటిస్తామని అన్నారు. 53 పేజీల మేనిఫెస్టోలో అన్ని అంశాలను సమగ్రముగా అందజేస్తామని చెప్పారు. హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్, కాంగ్రెస్ హయాంలో హర్యానా అభివృద్ధి పరంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు. బీజేపీ పాలనలో హర్యానా నేరాల కేంద్రంగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ 1గా తీర్చిదిద్దుతామని చెప్పారు.