Hydrogen Train: దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. హరియాణాలో త్వరలో ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును ప్రారంభించేందుకు హర్యానా రాష్ట్రం సిద్ధమవుతోంది. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో రూపొందించిన ఈ ప్రత్యేక రైలు జీంద్-సోనీపత్ మార్గంలో ప్రయాణించనుంది. పర్యావరణానికి హానికరం కాకుండా రూపొందించిన ఈ ప్రాజెక్టు దేశ రైల్వే రంగంలో కీలక మైలురాయిగా నిలవనుంది. ఈ రైలుకు అవసరమైన ఇంధనాన్ని సరఫరా చేయడానికి జీంద్‌లో ప్రత్యేకంగా హైడ్రోజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ రోజుకు 3,000 కిలోగ్రాముల సామర్థ్యంతో పనిచేస్తుంది. ప్లాంట్‌కు 11 కేవీల విద్యుత్ సరఫరా కల్పించనుండటంతో, రైలుకు నిరంతరాయంగా హైడ్రోజన్ ఇంధనం అందేలా ఏర్పాట్లు చేశారు.
వివరాలు
చివరి దశలో ప్రాజెక్టుకు సంబంధించిన పనులు
ఈ ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేందుకు హరియాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనురాగ్ రస్తోగి, దక్షిణ హరియాణా బిజ్‌లీ వితరణ్ నిగమ్ (డీహెచ్‌బీవీఎన్) అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించిన పనులు చివరి దశలో కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక త్వరలోనే హైడ్రోజన్‌తో నడిచే ఈ రైలును అధికారికంగా ప్రారంభించనున్నారు.