అమృత్‌పాల్ సింగ్ వేషం మార్చుకున్నాడా? 7ఫొటోలను విడుదల చేసిన పంజాబ్ పోలీసులు
'వారిస్ పంజాబ్ దే' చీఫ్, ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు ఏడు రోజులుగా విస్తృతంగా గాలిస్తున్నారు. అయినా ఇంతవరకు ఆయన ఆచూకీని కనుగోనలేకపోయారు. అయితే అమృత్‌పాల్ సింగ్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వేషం మార్చుకొని తిరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే వివిధ రూపాల్లో ఉన్న అమృతపాల్‌కు సంబంధించిన ఏడు ఫొటోలను పంజాబ్ పోలీసులు విడుదల చేశారు. ప్రజలు అమృత్‌పాల్ సింగ్‌ను గుర్తించడంలో ఈ ఫొటోలు సహాయపడుతాయని పోలీసులు భావిస్తున్నారు. క్లీన్ షేవ్‌తో పాటు పలు గడ్డం ఉన్న స్టిల్స్, విభిన్న తలపాగాలు ధరించిన ఫొటోలను పోలీసులు విడుదల చేశారు.
అమృత్‌పాల్ దేశం విడిచి పారిపోయి ఉంటాడా?
అమృత్‌పాల్ సింగ్ వివిధ రూపాల్లో ఫొటోలను విడుదల చేశామని, ఈ కేసులో అతన్ని అరెస్టు చేయడానికి ప్రజలు తమకు సహాయం చేయాలని అభ్యర్థిస్తున్నట్లు పంజాబ్ ఐజీసీ సుఖ్‌చైన్ సింగ్ గిల్ అన్నారు. అమృత్‌పాల్ సింగ్ తప్పించుకోవడానికి సహకరించిన నలుగురిని బుధవారం పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. జలంధర్‌లో అమృత్‌పాల్ కారును వెంబడించినప్పుడు, వాహనాలను మార్చిన తర్వాత, అతను సింగ్ మోటార్ సైకిల్‌పై పారిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. అతను తన బట్టలు, తలపాగా కూడా మార్చుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే, అమృత్‌పాల్ సింగ్ ఇప్పటికే దేశం విడిచి పారిపోయి ఉంటాడని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. నేపాల్ గుండా కెనడాకు వెళ్లి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.