Page Loader
అమృతపాల్ సింగ్‌ అరెస్టుకు ఆపరేషన్ షురూ: ఇంటర్నెట్ బంద్; పంజాబ్‌లో ఉద్రిక్తత
ఖలిస్తానీ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్‌ అరెస్టు

అమృతపాల్ సింగ్‌ అరెస్టుకు ఆపరేషన్ షురూ: ఇంటర్నెట్ బంద్; పంజాబ్‌లో ఉద్రిక్తత

వ్రాసిన వారు Stalin
Mar 18, 2023
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఖలిస్తానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం 'ఆపరేషన్ అమృతపాల్ సింగ్‌'ను ప్రారంభించారు. దీంతో పంజాబ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 100వాహనాల్లో పోలీసులు అమృతపాల్‌‌ కోసం వేటాడుతున్నట్లు సమాచారం. 'ఆపరేషన్ అమృతపాల్‌సింగ్‌' నేపథ్యంలో పంజాబ్ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కొంతకాలంగా అమృతపాల్ పంజాబ్‌లో తన కార్యకలాపాలను చురుగ్గా కొనసాగిస్తున్నారు. అమృత్‌పాల్ సహాయకులలో ఒకరిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అతని మద్దతుదారులు గత నెలలో అమృత్‌సర్ శివార్లలోని పోలీస్ స్టేషన్‌లో పోలీసులతో ఘర్షణకు దిగారు.

అమృతపాల్

అమృతపాల్ సింగ్ ఎవరు?

అమృతపాల్ సింగ్ ప్రస్తుతం 'వారిస్ పంజాబ్ దే' చీఫ్‌గా ఉన్నారు. ఖలిస్తానీ వేర్పాటువాదిగా అమృతపాల్ సింగ్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆపరేషన్ బ్లూస్టార్ సమయంలో మరణించిన భింద్రన్‌వాలే లాగే అమృతపాల్ సింగ్ వస్త్రాధారణ ఉంటుంది. దీంతో అందరూ అతన్ని 'భింద్రన్‌వాలే 2.0 అని పిలుస్తారు. అమృతపాల్ సింగ్ 2022లో భారతదేశానికి వచ్చి వారిస్ పంజాబ్ దే పగ్గాలు చేపట్టారు. అంతకు ముందు వరకు ఆయన దుబాయ్‌లో ఉద్యోగం చేసేవాడు. అమృతపాల్ సింగ్‌కు భారీ ఫాలోయింగ్ ఉంది. అతను తన అనుచరులతో భారీ ఆయుధాలతో తిరుగుతూ కనిపిస్తాడు. శనివారం అమృత్‌పాల్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు 100 వాహనాల్లో వెంబడించి అరెస్టు చేశారంటే అతడు ఎంత పవర్ పుల్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.