'దేశ ప్రజలకే వదిలేయండి'; స్వలింగ వివాహంపై కిరణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్
స్వలింగ సంపర్కుల వివాహంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వలింగ వివాహాల విషయం అనేది దేశ ప్రజల విజ్ఞతకే వదిలేయాల్సిన అంశం అని కిరెన్ రిజిజు అన్నారు. స్వలింగ వివాహం అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలా? పార్లమెంటుకు వదిలివేయాలా? అని అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ సమాధానం చెప్పారు. దేశ ఆలోచనలను ప్రతిబింబించే ప్రజల విజ్ఞతకే తాను వదిలేస్తున్నట్లు మంత్రి రిజిజు అన్నారు.
స్వలింగ వివాహం గురించి పార్లమెంటులో చర్చ జరగాలి: మంత్రి రిజిజు
పార్లమెంటులో కూర్చున్న సభ్యులు దేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్య వహిస్తారని, నిర్ణయాన్ని వారికే వదిస్తున్నట్లు మంత్రి రిజిజు పేర్కొన్నారు. సుప్రీంకోర్టుకు ఉండే అధికారులు దానికి ఉన్నాయని, అయితే స్వలింగ వివాహం గురించి పార్లమెంటులో చర్చ జరగాలన్నారు. పార్లమెంటు ఆమోదించిన ఏదైనా చట్టం రాజ్యాంగ స్ఫూర్తితో లేకపోతే, దాన్ని మార్చడానికి సుప్రీంకోర్టుకు అధికారం ఉంటుందన్నారు. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు చట్టంలో దేనినైనా సూచించవచ్చన్నారు. అలాగే తీర్పు కూడా ఇవ్వవచ్చన్నారు. మార్చి 13న, భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం దేశంలో స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన అనేక పిటిషన్లను సుప్రీంకోర్టులోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.