Page Loader
'ఏకేఎఫ్' పేరుతో ఆర్మీ ఏర్పాటుకు అమృతపాల్ సింగ్‌ ప్రయత్నం; వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు
'ఏకేఎఫ్' పేరుతో ప్రత్యేక ఆర్మీ ఏర్పాటుకు అమృతపాల్ సింగ్‌ ప్రయత్నం

'ఏకేఎఫ్' పేరుతో ఆర్మీ ఏర్పాటుకు అమృతపాల్ సింగ్‌ ప్రయత్నం; వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు

వ్రాసిన వారు Stalin
Mar 20, 2023
05:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్‌ను పట్టుకునేందకు పంజాబ్ పోలీసులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అయితే అమృతపాల్ సింగ్‌ వేటలో పోలీసులకు లభిస్తున్న ఆధారాలు కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి. అమృతపాల్ సింగ్‌ ఇంటి నుంచి పంజాబ్ పోలీసులు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, రైఫిల్స్‌ను పంజాబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అమృతపాల్ ఇంటి గేటుపై 'ఏకేఎఫ్' అని రాసి ఉండటాన్ని పోలీసులు గమనించారు. అమృతపాల్ సింగ్ 'ఆనంద్‌పూర్ ఖల్సా ఫౌజ్(ఏకేఎఫ్)' అనే మిలిటాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పంజాబ్ పోలీసులు పేర్కొన్నారు. పంజాబ్‌లో జరుగుతున్న ఘటనల్లో పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ పాత్రపై బలమైన అనుమానాలున్నాయని పంజాబ్ పోలీసులు తెలిపారు.

పంజాబ్

మంగళవారం మధ్యాహ్నం వరకు ఇంటర్నెట్ బంద్ పొడిగింపు

అమృతపాల్ సింగ్‌ ఇంకా అరెస్టు కానందున పంజాబ్‌లో మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవల సస్పెన్షన్‌ను మంగళవారం మధ్యాహ్నం వరకు పొడిగించారు. రాష్ట్రంలో శాంతి, సామరస్యానికి విఘాతం కలిగించడానికి ప్రయత్నించినందుకు 114 మందిని అరెస్టు చేసినట్లు పంజాబ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) సుఖ్‌చైన్ సింగ్ గిల్ చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నిలకడగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 'వారిస్ పంజాబ్ దే'లోని కొందరు సభ్యులపై ఆరు క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఆయన వివరించారు. కస్టడీలోకి తీసుకున్న దల్జీత్ కల్సి, బసంత్ సింగ్, గుర్మీత్ సింగ్ భుఖాన్‌వాలా, భగవంత్ సింగ్‌ను అస్సాంలోని దిబ్రూఘర్‌కు పంపినట్లు ఐజీపీ వెల్లడించారు. అమృతపాల్ సింగ్ మామను కూడా దిబ్రూఘర్ పంపుతున్నట్లు పేర్కొన్నారు.