అమృత్‌పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట; పంజాబ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన అతని మామ, డ్రైవర్
ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతోంది. శనివారం నుంచి అమృతపాల్ సింగ్‌కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అమృతపాల్‌పై ఉక్కుపాదం నేపథ్యంలో ఆదివారం రాత్రి కీలక పరిణామం చోటుచేసుకుంది. అమృతపాల్ మామ, డ్రైవర్ పంజాబ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ కేసులో ఆదివారం ఒక్కరోజే 34మందిని అరెస్టు చేయగా, ఇప్పటివరకు మొత్తం 112మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అమృత్‌పాల్ సన్నిహితుల్లో ఒకరైన లవ్‌ప్రీత్ తూఫాన్‌ను విడుదల చేయాలని, అతని మద్దతుదారులు గత నెలలో అమృత్‌సర్ శివార్లలోని అజ్నాలా పోలీస్ స్టేషన్‌పై మారణాయుధాలతో దాడి చేశారు. ఈఘటనను సీరియస్‌గా తీసుకున్న పంజాబ్ పోలీసులు అమృత్‌పాల్‌ను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు.
అమృతపాల్ ఇంటి వద్ద భారీ భద్రత
అమృతపాల్ సింగ్ మామ, డ్రైవర్ ఆదివారం రాత్రి లొంగిపోయినట్లు జలంధర్ ఎస్ఎస్‌పీ స్వర్ణదీప్ సింగ్ ధృవీకరించారు. వారిద్దరూ మెహత్‌పూర్‌లో లొంగిపోయినట్లు పేర్కొన్నారు. వీరిద్దరు మెర్సిడెస్ కారులో వచ్చినట్లు స్వర్ణదీప్ సింగ్ చెప్పారు. అమృతపాల్ సింగ్ ఇంకా పరారీలో ఉన్నాడని, అతనిని పట్టుకోవడానికి భారీ వేట కొనసాగుతోందని స్వర్ణదీప్ సింగ్ వెల్లడించారు. పంజాబ్ ప్రాదేశిక అధికార పరిధిలో మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవల సస్పెన్షన్‌ను సోమవారం మధ్యాహ్నం వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. అమృతపాల్ సింగ్ తప్పించుకోవడానికి ఉపయోగించిన వాహనాన్ని, మందుగుండు సామగ్రిని కూడా పంజాబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమృత్‌సర్‌లోని జల్లుపూర్ ఖేరా గ్రామంలోని అమృతపాల్ సింగ్ నివాసం వెలుపల పోలీసులు భారీ బలగాలను మోహరించారు.