Bhole Baba: హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. భోలే బాబాకు క్లీన్ చిట్ ఇచ్చిన జ్యుడిషియల్ కమిషన్
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హాథ్రస్ తొక్కిసలాట (Hathras Stampede) ఘటనలో గత సంవత్సరం 121 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
దీనిపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో మూడు మంది సభ్యులతో కూడిన జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
తాజాగా, ఈ కమిషన్ యూపీ ప్రభుత్వానికి పూర్తి నివేదికను సమర్పించింది. ఈ ఘటనకు భోలే బాబాకు సంబంధం లేదని కమిషన్ తన నివేదికలో పేర్కొంది.
ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు పలు వార్తా సంస్థలు వెల్లడించాయి.
భక్తుల అధిక సంఖ్యలో హాజరు కావడం వల్ల, ఊపిరాడకపోవడం కారణంగానే వారు మరణించారని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
వివరాలు
వివాదాస్పద ఘటన - ప్రభుత్వం నిర్ణయం
ఈ నివేదికపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత, ప్రస్తుత బడ్జెట్ సెషన్‌లో యూపీ శాసనసభలో సమర్పించే అవకాశం ఉంది.
నివేదిక ప్రకారం, సత్సంగ్ నిర్వహకులు, పోలీసులు తగిన ఏర్పాట్లు చేయకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని జ్యుడిషియల్ కమిషన్ అభిప్రాయపడింది.
ఇంతకు ముందు సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) కూడా ఈ ఘటనకు భోలే బాబా ప్రమేయం లేదని పేర్కొంది.
ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం,హాథ్రస్ జిల్లా సికంద్రరావ్ ప్రాంతం ఫుల్‌రయీ,ముగల్‌గఢీ గ్రామాల మధ్య ఖాళీ ప్రదేశంలో తాత్కాలిక షెడ్లు వేసి సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వివరాలు
హాథ్రస్ తొక్కిసలాట - ఏం జరిగింది?
నివేదిక ప్రకారం.. నిర్వాహకులు 80 వేల మంది భక్తులు మాత్రమే హాజరవుతారని పోలీసుల అనుమతి తీసుకున్నారు.
అయితే అదే రోజు 2.5 లక్షల మందికి పైగా భక్తులు అక్కడికి చేరుకున్నారు. సత్సంగ్ ముగిసిన తర్వాత, భక్తులు భోలే బాబా వెనక పరుగెత్తడం, ఆయన పాదాల వద్ద మట్టిని తీసుకోవడానికి ప్రయత్నించడం వంటివి జరిగాయి.
దీంతో తొక్కిసలాట ఏర్పడి 121 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరణించినవారందరికీ ఊపిరాడకపోవడం వల్లే మృతి సంభవించినట్లు శవపరీక్షల్లో తేలిందని ఎటాలో జిల్లా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, భోలే బాబాను నిందితుడిగా చేర్చలేదని అలీగఢ్ ఐజీ శాలభ్ మాథుర్ తెలిపారు.