#NewsBytesExplainer: ఏపీలో సూపర్ సిక్స్ హామీలు ఎంత మేర అమలయ్యాయి?
ఈ వార్తాకథనం ఏంటి
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు, తెలుగుదేశం,జనసేన పార్టీలు సూపర్ సిక్స్ పేరుతో ఆరు సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ కూటమి భాగంగా ఉన్నప్పటికీ,ఆ పార్టీ నాయకులు స్పష్టంగా ఎక్కడా ప్రకటన చేయలేదు. సెప్టెంబర్ 10న అనంతపురంలో "సూపర్ సిక్స్ సూపర్ హిట్" పేరుతో ఎన్డీయే కూటమి మొదటి ఉమ్మడి సభ నిర్వహించారు. తల్లికి వందనం ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థికీ రూ.15,000 తల్లుల అకౌంట్లలో జమ చేస్తామని హామీ ఇచ్చారు. 2024లో ఇది అమలు కాలేదు. 2025-26 బడ్జెట్‌లో నిధులు కేటాయించి, జూన్ 12 నుండి అమలు ప్రారంభం అయింది. వాస్తవానికి, రూ.15,000 బదులు రూ.13,000 తల్లుల అకౌంట్లలో,మిగిలిన రూ.2,000 స్కూల్ అభివృద్ధి ఖాతాలో జమ అవుతోంది.
వివరాలు
2024 దీపావళికి మొదటి సిలిండర్ పంపిణీ
ఇప్పటివరకు 67 లక్షల విద్యార్థుల తల్లుల అకౌంట్లలో రూ.8,745 కోట్లు జమ అయ్యాయి. దీపం 2.0 వైట్ రేషన్ కార్డు ఉన్న మహిళలకు ప్రతి సంవత్సరం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే హామీ ఇచ్చారు. 2024 దీపావళి సందర్భంగా మొదటి సిలిండర్ పంపిణీ ప్రారంభమైంది. 2025 ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్, ఆగస్టు-నవంబర్ మధ్య మూడో సిలిండర్ పంపిణీ మొదలైంది. ఇప్పటివరకు రూ.1,704 కోట్లు ఖర్చు చేసి 2.45 కోట్ల సిలిండర్లు పంపిణీ అయ్యాయి. మూడో విడతలో కూడా 65 లక్షల మందికి సిలిండర్లు పంపిణీ.
వివరాలు
స్త్రీశక్తి పథకం
మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం (పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, అల్ట్రా ఎక్స్‌ప్రెస్) అందించారు. దాదాపు 2.6 కోట్ల మంది మహిళలు ఈ సౌకర్యాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రతిరోజూ సుమారు 25 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. దీనికి రూ.2,000 కోట్లు ఖర్చు అయ్యాయి. 129 ఆర్టీసీ డిపోలలో 60 డిపోల్లో వంద శాతం ఆక్యుపెన్సీ ఉంది. అన్నదాత సుఖీభవ రైతులకు ఏటా రూ.20,000 ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. 2024లో అమలు లేదు. 2025 బడ్జెట్‌లో రూ.6,300 కోట్లు కేటాయించి,ఆగస్టు 2 నుండి తొలి విడతగా రూ.7,000 (రాష్ట్రం రూ.5,000 +కేంద్రం పీఎం కిసాన్ రూ.2,000)రైతుల అకౌంట్లలో జమ అయ్యాయి.
వివరాలు
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
మిగిలిన మొత్తం రెండు విడతలలో జమ చేయనున్నారు. మొత్తం మూడు విడతల్లో రూ.20,000: రాష్ట్రం రూ.14,000 + కేంద్రం రూ.6,000. ఉపాధి హామీలు రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయ్యాయి. నైపుణ్య శిక్షణ ద్వారా లక్ష మంది యువతకు ఉద్యోగాలు లభించాయి. 8 లక్షల మంది ఉద్యోగాల కోసం ఒప్పందాలు కుదిరాయి. మిగిలిన నిరుద్యోగ యువతకు రూ.3,000 నిరుద్యోగ భృతి పై స్పష్టత లేదు.
వివరాలు
మహిళా నెలవారీ భృతి
18 సంవత్సరాలు పూర్తి చేసిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇవ్వాలనే హామీ ఇప్పటివరకు పూర్తిగా అమలు కాలేదు. మొత్తంగా స్కూల్ విద్యార్థులకు రూ.13,000, మహిళలకు ఉచిత బస్సు, రైతులకు అన్నదాత సుఖీభవ రెండో ఏడాది నుంచి అమలు చేస్తోన్న ప్రభుత్వం.. దీపం 2.0 ద్వారా మూడు గ్యాస్ సిలిండర్లు 2024 చివరి నుంచి అమల్లోకి తెచ్చింది. మహిళలకు నెలవారీ భృతి, యువతకు నిరుద్యోగ భృతిపై ఇంకా స్పష్టత లేదు. ఆ రెండింటి బదులు... నిరుద్యోగులకు రూ.3000 భృతి, మహిళలకు రూ.1500 భృతిపై ఎక్కడా మాట్లాడని కూటమి ప్రభుత్వం.. ఈ రెండు నగదు పథకాల బదులు, ఫించన్ల పెంపు, మెగా డీఎస్సీ పోస్టుల భర్తీని సూపర్ సిక్స్‌లో పేర్కొంది.
వివరాలు
'అందుకే పీ-4'
సూపర్ సిక్స్‌లో ఉన్న ఆరు హామీలే కాకుండా,వాటికి మించి ఇంకా ఎక్కువ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. మహిళలకు నెలకు రూ.1,500 అందించడంలోనే ఆప్యాయత పరిమితం చేయకుండా,మొత్తం కుటుంబాన్ని కవర్ చేయగల రీతిలో ఆర్ధిక సహాయం అందించే విధంగా పీ-4 పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. ఈ పథకం మునుపటి హామీల కంటే బెటర్‌గా,పీ-4 ద్వారా రాష్ట్రంలోని పేద కుటుంబాల ఇళ్లలో కొత్త వెలుగులు,సౌభాగ్యాలు వెలువడుతాయని మంత్రి చెప్పారు. నిరుద్యోగ భృతిపై మాట్లాడుతూ.. వచ్చే ఐదు సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను సృష్టించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, భృతికి కాకుండా ఉపాధిని కల్పించడంనే ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు.