e-library: క్లిక్ చేశారా? 'ఈ-లైబ్రరీ తెలంగాణ'.. 16 లక్షల మందికి ఉచితంగా విజ్ఞానం!
ఈ వార్తాకథనం ఏంటి
పుస్తకాలు కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థులు, ఉద్యోగ సమాచారం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు 'ఈ-లైబ్రరీ తెలంగాణ' ఒక వరంగా మారింది. హైదరాబాద్‌లోని హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న డాక్టర్ దుర్గాప్రసాద్ తన సొంత ఖర్చుతో రూపొందించిన ఈ ఉచిత డిజిటల్ వేదిక ద్వారా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 16 లక్షల మందికిపైగా విద్యార్థులు ప్రయోజనం పొందారు. విద్యార్థులకు అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం 2024లో డాక్టర్ దుర్గాప్రసాద్‌ను 'బెస్ట్ లైబ్రేరియన్ అవార్డు'తో సత్కరించింది. తన ప్రయాణం గురించి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. మాది సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం జనలదిన్నె గ్రామం.
వివరాలు
విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు
నేరేడుచర్లలో గ్రంథాలయం ఉండటంతో చిన్నప్పటి నుంచే అక్కడికి వెళ్లి చదువుకునేవాడిని.
తర్వాత మిర్యాలగూడలో డిగ్రీ చదువుతున్న సమయంలో లైబ్రరీ ఉన్నప్పటికీ విద్యార్థులు ఉచితంగా పుస్తకాలు చదివే అవకాశం లేకపోవడం నాకు ఎంతో బాధ కలిగించింది.
ఆ అనుభవమే పేద విద్యార్థుల కోసం ఏదైనా చేయాలనే ఆలోచనకు కారణమైంది'' అని చెప్పారు. అనంతరం లైబ్రరీ సైన్స్‌లో చదువు పూర్తి చేసి ఉద్యోగం సాధించిన ఆయన, 2019లో elibrarytelangana.blogspot.com పేరుతో ఉచిత డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు.
ఈ వేదికలో అన్ని తరగతుల విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలతో పాటు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడే అనేక పుస్తకాలను ఒకేచోట అందుబాటులో ఉంచారు.
వివరాలు
విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఉచిత విజ్ఞాన వేదికగా ఈ-లైబ్రరీ
తెలుగు అకాడమీ, ఎన్‌సీఈఆర్‌టీ వంటి పలు ప్రచురణల పుస్తకాలను కూడా ఉచితంగా అందిస్తున్నారు.
అంతేకాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయిలో విడుదలయ్యే అన్ని రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు, దరఖాస్తు లింకులను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా అభ్యర్థులకు చేరవేస్తున్నట్లు డాక్టర్ దుర్గాప్రసాద్ వివరించారు.
ఈ విధంగా 'ఈ-లైబ్రరీ తెలంగాణ' విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఉచిత విజ్ఞాన వేదికగా సేవలందిస్తోంది.