Loading...
Madhya Pradesh: ముగ్గురు పిల్లలున్నా ప్రభుత్వ ఉద్యోగం పోదు.. 25 ఏళ్ల నిబంధనను రద్దు చేసిన మధ్యప్రదేశ్!
ముగ్గురు పిల్లలున్నా ప్రభుత్వ ఉద్యోగం పోదు.. 25 ఏళ్ల నిబంధనను రద్దు చేసిన మధ్యప్రదేశ్

Madhya Pradesh: ముగ్గురు పిల్లలున్నా ప్రభుత్వ ఉద్యోగం పోదు.. 25 ఏళ్ల నిబంధనను రద్దు చేసిన మధ్యప్రదేశ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2026
04:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌లోని మోహన్ యాదవ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 25 ఏళ్లుగా అమల్లో ఉన్న 'ఇద్దరు పిల్లల నిబంధన'ను పూర్తిగా రద్దు చేస్తూ సంచలన నిర్ణయం ప్రకటించింది. మందసౌర్‌లోని గాంధీసాగర్‌లో నిర్వహించిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ సివిల్ సర్వీసెస్ రూల్స్, 1961కు సవరణ చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఇకపై మూడో సంతానం ఉన్నంత మాత్రాన ప్రభుత్వ ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగించరు. అంతేకాకుండా కొత్త ఉద్యోగాల నియామకాల్లోనూ ముగ్గురు పిల్లలున్న అభ్యర్థులను అనర్హులుగా పరిగణించరు. ఈ నిర్ణయంతో ఒక్క స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లోనే 30 వేలకు పైగా ఉపాధ్యాయులకు ప్రత్యక్ష ప్రయోజనం కలగనుంది.

వివరాలు

గతంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి వర్తించని సడలింపు

వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఈ నిబంధనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సుమారు 8 వేల నుంచి 10 వేల కేసులు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.

ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది.

ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేసినప్పటికీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైన షరతు విధించింది.

2001 సంవత్సరం తర్వాత ఈ నిబంధన కింద ఇప్పటికే అంతిమ ఉత్తర్వులు జారీ అయి, సర్వీసు నుంచి తొలగించబడిన ఉద్యోగుల కేసులను తిరిగి తెరిచి విచారించమని స్పష్టం చేసింది.

అంటే గతంలో ఈ నిబంధన కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి తాజా సడలింపు వర్తించదు.

వివరాలు

జ్యుడీషియల్ అధికారులకూ తప్పని శిక్షలు

ఈ కఠిన నిబంధనను 2001 జనవరి 26న అప్పటి ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది.

జనాభా నియంత్రణ లక్ష్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇద్దరు పిల్లల నిబంధనను తప్పనిసరి చేసింది.

గతంలో ఈ నిబంధన ఎంత కఠినంగా అమలయ్యేదంటే.. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారనే కారణంతో కొందరు జ్యుడీషియల్ అధికారులను సైతం ఉద్యోగాల నుంచి తొలగించారు.

తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతం సర్వీసులో ఉన్న అర్హులైన ఉద్యోగులకు ఊరట లభించనుంది.

ADVERTISEMENT

వివరాలు

రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లోనూ గతంలోనే రద్దు

మధ్యప్రదేశ్ కంటే ముందే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు కూడా ఈ ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేశాయి.

రాజస్థాన్ ప్రభుత్వం 2016లో, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2017లో ఈ నిర్ణయం తీసుకున్నాయి.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడో సంతానం ఉన్నవారికి ఏకంగా రూ.25 వేల ప్రోత్సాహకాన్ని ప్రకటించడం గమనార్హం.

ADVERTISEMENT