LOADING...
Telangana: తెలంగాణలో హెల్త్ ఏటీఎంల ప్రారంభం.. నిమిషాల్లో 130 టెస్టులు ఉచితం
తెలంగాణలో హెల్త్ ఏటీఎంల ప్రారంభం.. నిమిషాల్లో 130 టెస్టులు ఉచితం

Telangana: తెలంగాణలో హెల్త్ ఏటీఎంల ప్రారంభం.. నిమిషాల్లో 130 టెస్టులు ఉచితం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 13, 2026
12:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులకు, రిపోర్టుల కోసం రోజుల పాటు ఎదురుచూడాల్సిన ఇబ్బందులకు ముగింపు పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. వైద్యారోగ్య సేవలను బలోపేతం చేసే దిశగా, పేదలకు వేగవంతమైన మరియు నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా "హెల్త్ ఏటీఎం"లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ యంత్రాల ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే సుమారు 130 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా కింగ్ కోటి హాస్పిటల్, మలక్‌పేట్ ప్రభుత్వ ఆసుపత్రిల్లో ప్రారంభించారు. అక్కడ ఈ హెల్త్ ఏటీఎంలు ఆశించిన ఫలితాలను ఇవ్వడంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.

వివరాలు

రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి ప్లాన్

ఈ యంత్రాల ద్వారా వచ్చిన పరీక్ష ఫలితాలను టీ-డయాగ్నోస్టిక్స్, ప్రముఖ ప్రైవేట్ ల్యాబ్‌ల రిపోర్టులతో పోల్చి చూసినప్పుడు కచ్చితత్వం ఉన్నట్లు తేలింది. ఈ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల పేద, సామాన్య ప్రజలకు వేల రూపాయలు ఖర్చయ్యే కీలక పరీక్షలు ఇకపై సులభంగా, త్వరగా అందుబాటులోకి రానున్నాయి. క్లౌడ్ ఆధారిత సాంకేతికతతో పనిచేసే ఈ హెల్త్ ఏటీఎంల ద్వారా బీపీ, ఈసీజీ, శరీర కొవ్వు శాతం, ఆక్సిజన్ స్థాయులు, శరీర ఉష్ణోగ్రత వంటి సుమారు 65 రకాల ప్రాథమిక పరీక్షలను కొన్ని నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. అలాగే రక్త నమూనాల ఆధారంగా గ్లూకోజ్, హిమోగ్లోబిన్, లిపిడ్ ప్రొఫైల్, కాలేయం, కిడ్నీ పనితీరు, థైరాయిడ్ వంటి ముఖ్య పరీక్షలను కూడా నిర్వహించనున్నారు.

వివరాలు

ఎస్ఎంఎస్ ద్వారా నేరుగా మొబైల్‌కు మెసేజ్

అదనంగా గర్భిణుల కోసం ఫీటల్ డాప్లర్, చర్మ వ్యాధుల గుర్తింపుకు డెర్మాస్కోప్ వంటి ప్రత్యేక సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ సేవలను మరింత పారదర్శకంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA)తో అనుసంధానం చేశారు. దీని ద్వారా రోగి చేయించుకున్న ప్రతి పరీక్ష రిపోర్ట్ డిజిటల్ రూపంలో వారి అభా కార్డులో భద్రంగా నిల్వ అవుతుంది. పరీక్ష పూర్తయ్యిన వెంటనే రిపోర్టులు వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా నేరుగా మొబైల్‌కు పంపబడతాయి. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేని గ్రామీణ ప్రజలకు సహాయం అందించేందుకు ప్రతి కేంద్రంలో ప్రత్యేక సిబ్బందిని నియమించనున్నారు.

Advertisement

వివరాలు

గంట సమయం పట్టే అవకాశం

అయితే పైలట్ దశలో ఒక సవాలు కూడా గుర్తించారు. ఒక రోగికి అన్ని పరీక్షలు పూర్తి చేయడానికి సుమారు 45 నిమిషాల నుంచి గంట వరకు సమయం పడుతోంది. దీనికి పరిష్కారంగా, రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన ఆసుపత్రుల్లో రెండు లేదా మూడు హెల్త్ ఏటీఎం యూనిట్లను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. త్వరలోనే ఈ సదుపాయాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు విస్తరించేందుకు వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది.

Advertisement