
Covid cases: దేశంలో 7నెలల గరిష్ట స్థాయికి కరోనా కేసులు.. మాక్ డ్రిల్స్‌కు కేంద్రం పిలుపు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో కరోనా కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 614మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ ఏడాది మే 21 నుంచి ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
దేశంలో కొత్త కేసులు భారీగా పెరగడానికి కేరళలో వెలుగు చూసిన కోవిడ్ సబ్-వేరియంట్ JN.1నే కారణమని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది.
గత 24 గంటల వ్యవధిలో కేరళలో మూడు మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్త మరణాలు సంఖ్య 5,33,321కు చేరుకుంది.
దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.50 కోట్లు (4,50,05,978)కు చేరుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కరోనా
కరోనా కేసుల పెరుగుదలపై కేంద్రం సమీక్ష
దేశంలోని కోవిడ్ -19 కేసులు, మరణాల ఆకస్మిక పెరుగుదలపై సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం సమావేశాన్ని నిర్వహించింది.
ఈ సమావేశానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించారు.
కేంద్రమంత్రులు, కేంద్ర ఆరోగ్య అధికారులు, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కోవిడ్ కొత్త, అభివృద్ధి చెందుతున్న వేరియంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని మన్సుఖ్ మాండవీయ సూచించారు.
వైరస్‌ను సమర్థంగా నిర్వహించేందుకు కేంద్రం, రాష్ట్రాలు సంయుక్తంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో ప్రతి మూడు నెలలకు ఒకసారి మాక్ డ్రిల్‌లు చేపట్టి, ఉత్తమ విధానాలను పంచుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు.