Chandra Babu: సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ.. జనవరి 17కు వాయిదా
ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra Babu) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరిగింది. తదుపరి విచారణ జనవరి 17కు వాయిదా వేసింది. ఈ కేసు సుప్రీం కోర్టులో ఇవాళ విచారణకు రాగా న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేల ఎం. త్రివేది ధర్మాసనం విచారణ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇటు చంద్రబాబు నాయుడు కానీ, అటు ఏపీ ప్రభుత్వం కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని సూచించింది. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని ఆదేశాలను జారీ చేసింది. చంద్రబాబు ఏమైనా ప్రకటనలు చేసి ఉంటే ఆ రికార్డులను తమకు సమర్పించాలని కోర్టు ఆదేశించారు.
ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును అశ్రయించిన చంద్రబాబు
ఈ అంశంపై తీర్పు వచ్చాకే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ చేస్తామని సుప్రీం కోర్టు క్లారిటీ ఇచ్చింది. అయితే అప్పటివరకూ చంద్రబాబును అరెస్టు చేయకూడదని సుప్రీం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ఫైబర్ నెట్ కుంభకోణానికి పాల్పడ్డారన్న అభియోగాలపై మాజీ సీఎం చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే. ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దాన్ని కోర్టు తిరస్కరించింది. దీంతో చంద్రబాబు సుప్రీం కోర్టును అశ్రయించారు.