Andhra Pradesh Heatwave: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల ఉధృతి.. 9 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఇంకా మార్చి నెల పూర్తవకముందే సూర్యుడు మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) శుక్రవారం (మార్చి 27) పలు ప్రాంతాలకు వడగాలులపై హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు అయ్యే అవకాశముందని అంచనా వేసింది.
వివరాలు
9 మండలాల్లో తీవ్ర వడగాలులు
విపత్తుల నిర్వహణ శాఖ వివరాల ప్రకారం, మొత్తం 9 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతూరు, కూనవరం, వి.ఆర్.పురం మండలాలు ప్రభావితమయ్యే అవకాశముంది. అలాగే కాకినాడ జిల్లాలో జగ్గంపేట, తూర్పుగోదావరి జిల్లాలో కొరుకొండ, ఎన్టీఆర్ జిల్లాలో జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో తీవ్ర వడగాలులు ఉండొచ్చని తెలిపింది. శనివారం (మార్చి 28) పరిస్థితి ఇంకా తీవ్రమయ్యే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండొచ్చని హెచ్చరించారు.
వివరాలు
మరో 32 మండలాల్లో వడగాలుల ప్రభావం
తీవ్ర వడగాలులతో పాటు మరో 32 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 7 మండలాలు, విజయనగరం జిల్లాలో 4, ఏలూరు జిల్లాలో 4 మండలాలు ప్రభావితమయ్యే అవకాశముంది. రేపు మరింత తీవ్రత.. 90 మండలాలకు హెచ్చరిక పార్వతీపురం మన్యం జిల్లాలో 3, అల్లూరి జిల్లాలో 3 మండలాలు, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో రెండేసి మండలాలు, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో ఒక్కో మండలంలో వడగాలులు వీస్తాయని వివరించారు.
వివరాలు
ప్రజలకు సూచనలు
ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా మద్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉండటం మంచిదని తెలిపారు. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ వంటి రక్షణ సాధనాలు వాడాలని సూచించారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.