
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ వద్ద భారీ వరద ప్రవాహం.. 69 గేట్లు ఎత్తివేత
ఈ వార్తాకథనం ఏంటి
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్‌లోకి 3 లక్షల 3 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఈ కారణంగా అధికారులు 69 గేట్లను పూర్తిగా ఎత్తి, సుమారు 2 లక్షల 97 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్ట్ నుంచి మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
మొదటి ప్రమాద హెచ్చరిక
ఈ నేపథ్యంలో, మరో రెండు మూడు గంటల్లోనే ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. అధికారులు ఇప్పటికే కృష్ణా నది పరివాహక ప్రాంతాల ప్రజలకు అప్రమత్తం చేశారు. నదీ పరివాహక వ్యవసాయ పొలాల్లోకి వెళ్లరాదని, మత్స్యకారులు ఈ సమయంలో వేటకు వెళ్లరాదని ప్రత్యేకంగా సూచించారు. అదేవిధంగా, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని లోతట్టు ప్రాంత ప్రజలను కూడా జిల్లా యంత్రాంగం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.