AP Rains: తడ వద్ద తీరం దాటిన వాయుగుండం.. దక్షిణ కోస్తా.. రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటకముందే వాయుగుండం బలహీనపడింది. నెల్లూరు జిల్లా తడ సమీపంలో తీరం దాటిన వాయుగుండం, గడిచిన 6 గంటల్లో 22 కిలోమీటర్ల వేగంతో తీరం దాటింది. ప్రస్తుతం ఇది అల్పపీడనంగా బలహీన పడింది. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. తుఫాను తీరం దాటడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సూళ్లూరుపేట, తడ, దొరవారిసత్రం, పెళ్లకూరు, నాయుడుపేట, గూడూరు, మనుబోలు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
సంగం బ్యారేజ్ వద్ద 12 గేట్లు, నెల్లూరు బ్యారేజ్ వద్ద 2 గేట్లు ఎత్తి నీటి విడుదల
గూడూరు సమీపంలోని పంబలేరు నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయాలు, చెరువులకు భారీగా వరద నీరు చేరుతోంది. సంగం బ్యారేజ్ వద్ద 12 గేట్లు, నెల్లూరు బ్యారేజ్ వద్ద 2 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. గడచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా సగటున 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జలదంకిలో 18 సెంటీమీటర్లు, కావలిలో 17 సెంటీమీటర్లు, నెల్లూరులో 13 సెంటీమీటర్లు, కొండాపురం, సీతారామపురం ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షం పడింది. సీతారామపురం, అనంతసాగరం, కలిగిరి, బోగోలు మండలాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ప్రజలు మరో 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అలాగే, జిల్లాలో విద్యా సంస్థలకు ఈరోజు కూడా సెలవును ప్రకటించారు.