LOADING...
RainAlert: ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల విస్తారంగా వర్షాలు.. మరో 5 రోజుల పాటు ఇదే వాతావరణం
ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల విస్తారంగా వర్షాలు.. మరో 5 రోజుల పాటు ఇదే వాతావరణం

RainAlert: ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల విస్తారంగా వర్షాలు.. మరో 5 రోజుల పాటు ఇదే వాతావరణం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2025
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రమైన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో రోడ్లు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి మంగళవారం ఉదయం నుండి బుధవారం ఉదయం వరకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో అత్యధికంగా 19 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దక్షిణ కోస్తా,రాయలసీమలోని పది ప్రాంతాల్లో 10 సెం.మీ.కి పైగా వర్షం కురిసింది. బుధవారం శ్రీపొట్టిశ్రీరాములునెల్లూరు,కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, డా.బీఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి. అత్యధికంగా సాయంత్రం 5 గంటల వరకు నెల్లూరు జిల్లా మర్రిపాడులో 8.8 సెం.మీ. వర్షం నమోదైంది. తమిళనాడు రాష్ట్రంలో కూడా రెండు రోజులుగా తీవ్రమైన వర్షాలు కురుస్తున్నాయి.

వివరాలు 

తమిళనాడులోనూ రెండు రోజులుగా భారీ వర్షాలు

చెన్నై, కడలూరు సహా 12 జిల్లాల్లో బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తంజావూర్, తిరువారూరు, నాగపట్టిణం జిల్లాల్లో 1.30 లక్షల ఎకరాలకు పైగా పంటలు నీటమునిగాయి. కడలూరు జిల్లా ఆండార్‌ ముళ్లిపాళ్యంలో ఇల్లు కూలి తల్లీ, కుమార్తెలు మృతి చెందారు. పుదుచ్చేరిలో గత 24 గంటల్లో అత్యధికంగా 25 సెం.మీ. వర్షం నమోదైంది. భారత వాతావరణ విభాగం (IMD) ప్రకారం, అల్పపీడనం క్రమంగా వాయవ్య దిశగా కదులుతూ గురువారం నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు చేరవచ్చు. వాయుగుండంగా బలపడే పరిస్థితులు ఉండటంతో పలు వాతావరణ మోడళ్లు హెచ్చరిస్తున్నాయి.

వివరాలు 

పోర్టులకు మూడో నంబరు హెచ్చరిక 

తీవ్ర అల్పపీడనం కారణంగా రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం శ్రీపొట్టిశ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్‌ కడప,శ్రీసత్యసాయి,అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం మత్స్యకారులకు ఆదివారం వరకు వేటకు వెళ్లవద్దని సూచించింది. మచిలీపట్నం,నిజాంపట్నం,కృష్ణపట్నం,వాడరేవు పోర్టులకు మూడో నంబరు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు అరేబియా సముద్రంలో మరో వాయుగుండం కొనసాగుతోందని IMD తెలిపింది. అలాగే బంగాళాఖాతంలో గురువారం మరో అల్పపీడనం, 25 నుంచి 28 మధ్యలో రెండు అదనపు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి.

వివరాలు 

సిద్ధంగా ఉండాలి: హోంమంత్రి అనిత 

శ్రీకాళహస్తి (తిరుపతి): 19 సెం.మీ., కోడూరు (కడప): 18 సెం.మీ. ,తొట్టంబేడు (తిరుపతి): 18 సెం.మీ., ఆత్మకూరు (నెల్లూరు): 15 సెం.మీ., సూళ్లూరుపేట (తిరుపతి): 14 సెం.మీ. హోం, విపత్తుల నిర్వహణశాఖ మంత్రి అనిత అన్ని జిల్లాల్లో యంత్రాంగం సిద్ధంగా ఉండాలని, NDRF, SDRF బృందాలను అప్రమత్తం చేయాలని, ప్రభావిత జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.