High Alert for AP: నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ, వాయువ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు.
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
అలాగే కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశముంది. మరోవైపు, గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం వద్ద 44.4 అడుగుల నీటిమట్టం నమోదు కాగా, ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7,00,706 లక్షల క్యూసెక్కులు ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలియజేసింది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముందని, కృష్ణానదిలో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోందని తెలిపారు.