Weather Report : తెలంగాణలో మళ్లీ 2 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు
రానున్న రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ హెచ్చరించింది. సెప్టెంబరు 20,21 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఇలాంటి వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది.హైదరాబాద్‌లో సెప్టెంబర్ 20 వరకు నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. శుక్రవారం(సెప్టెంబర్ 20)వరకు నగరంలో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడనున్నాయి. ఇది నైరుతి రుతుపవనాల సమయంలో కురిసే వర్షపాతం మరింత పెరిగే అవకాశాన్ని సూచిస్తోంది. నైరుతి రుతుపవనాల కారణంగా,తెలంగాణలో సగటు వర్షపాతం 898.1 మిమీ నమోదైంది.ఇది సాధారణ వర్షపాతం 668.6 మిమీతో పోలిస్తే 34 శాతం అధికం.
ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు
సెప్టెంబర్ 20వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, కరీంనగర్, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. సెప్టెంబర్ 21వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఏపీలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం
ఇటీవల హైదరాబాద్ వాతావరణ కేంద్రం సెప్టెంబర్ 22వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మాత్రమే కురుస్తాయని అంచనా వేసింది. ప్రస్తుతం ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది. ఇవాళ (సెప్టెంబర్ 18) హైదరాబాద్ వాతావరణ పరిస్థితులు పరిగణలోకి తీసుకుంటే, ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని కనిపిస్తుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో నగరంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వీచే అవకాశం కూడా ఉంది. ఏపీలో, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మణ్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.