Loading...
Telangana: తెలంగాణలో భారీ వర్షాలు.. ప్రాజెక్టుల్లోకి పోటెత్తుతున్న వరద నీరు
తెలంగాణలో భారీ వర్షాలు.. ప్రాజెక్టుల్లోకి పోటెత్తుతున్న వరద నీరు

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు.. ప్రాజెక్టుల్లోకి పోటెత్తుతున్న వరద నీరు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2026
08:00 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో జలాశయాల్లో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతుండగా, సాగునీటిపై ఆశలు పెట్టుకున్న రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అయితే మరోవైపు వరదల కారణంగా పలు ప్రాంతాల్లో సాధారణ జనజీవనం దెబ్బతింది. ముఖ్యంగా సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి, మట్టి తొలగింపు పనులు నిలిచిపోయాయి.

వివరాలు 

గోదావరి ఉధృతికి పలుచోట్ల నిలిచిపోయిన రాకపోకలు

మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ప్రస్తుతం 46వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది.

20.175 టీఎంసీల పూర్తి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 12.88టీఎంసీల నీరు నిల్వ ఉంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు 96,445 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది.

వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు 24గేట్లు ఎత్తి 96,472క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదే సమయంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వట్టి వాగు ప్రాజెక్టుకు 8 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది.

పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మూడు గేట్లను ఎత్తి 10,500 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు.

వివరాలు 

సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లోకి వరద.. పూర్తిగా ఆగిన బొగ్గు ఉత్పత్తి

భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రవాణా,సాధారణ కార్యకలాపాలపై ప్రభావం పడింది.

జగిత్యాల జిల్లాలో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ధర్మపురి పుష్కర ఘాట్లను వరద నీరు ముంచెత్తింది.

అనంతారం వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించడంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

ఇక మంచిర్యాల జిల్లాలోని ఇందారం,శ్రీరాంపూర్,కల్యాణి ఖని సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు చేరింది.

దీంతో రోజుకు సుమారు 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో పాటు 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు కూడా పూర్తిగా ఆగిపోయాయని అధికారులు తెలిపారు.

వర్షాలు తగ్గిన తర్వాతే గనుల్లో నీటిని తొలగించి సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించే అవకాశం ఉందని వారు వెల్లడించారు.

ADVERTISEMENT