
AP Rains: మూడ్రోజులు భారీ వర్షాలు.. ఏపీలో రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వచ్చే మూడ్రోజులు వర్షాలు విస్తృతంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం నాటికి వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా కొత్త అల్పపీడనం ఏర్పడనుంది. అదనంగా చత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో పాటు ఉపరితల ఆవర్తనం, బికనేర్ నుంచి కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు ద్రోణి ఏర్పడటంతో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Details
ఏపీలో వర్షాల పరిస్థితి ఇదే
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో కోస్తా జిల్లాల్లో చెదురుమదురు వర్షాల నుంచి భారీ వర్షాలు పడతాయని, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. ముఖ్యంగా ఆదివారం అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీవర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. మత్స్యకారులు మంగళవారం వరకు సముద్రంలో వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.
Details
తెలంగాణలో హెచ్చరికలు
ఇక తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. దాంతో రాష్ట్ర వాతావరణశాఖ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. మొత్తానికి, వచ్చే మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ అప్రమత్తం చేసింది.