Heavy rains: వణికించిన వాయుగుండం.. పంటలు కొట్టుకుపోయి రైతన్న కన్నీరు.. స్తంభించిన జనజీవనం
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడడంతో ఆంధ్రప్రదేశ్ ని అతలాకుతలం చేసింది. బుధవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి జనజీవనం స్తంభించింది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. చేతికొచ్చిన వరి పైరు నేలవాలి రైతన్నకు కన్నీరే మిగిలింది. కోత దశలో ఉన్న టమాట దెబ్బతింది. పొగాకు తదితర పంటలకూ నష్టం వాటిల్లింది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి.నగరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం కావడంతోపాటు ప్రధాన వీధుల్లో మోకాలి లోతు నీరు ప్రవహించింది. నెల్లూరు,కడప,తిరుపతి,నంద్యాల తదితర నగరాలు,పట్టణాలు జలమయమయ్యాయి.
చెరువులను తలపించిన రహదారులు
నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్, కనకమహల్ సెంటర్, ముత్తుకూరు కూడలి సమీపంలోని రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీరు నిలిచింది. మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జి, రామలింగాపురం, లెక్చరర్స్ కాలనీ, హరినాథపురం నాగసాయి మందిరం తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. కడపలో రహదారులు చెరువులను తలపించాయి. మురుగు కాలువల్లో ప్రవాహం లేక రహదారులపై వరద ప్రవహించింది. తిరుపతి పరిధిలోని గొల్లవానిగుంట, పూలవానిగుంట, ఆటోనగర్, రేణిగుంట సమీపంలోని భగత్‌సింగ్ కాలనీ, జ్యోతిరావు ఫులే కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. ఒంగోలు నగరంలోని పలు లోతట్టు కాలనీల్లో వర్షపు నీరు చేరింది.
కొట్టుకుపోయిన రహదారులు
ప్రతి రోజు ఉదయం హైదరాబాద్ నుంచి రేణిగుంటకు తిరిగే ఇండిగో విమానం నిర్ణీత సమయానికి ఇక్కడికి వచ్చినా.. భారీ వర్షం కారణంగా చెన్నైకి మళ్లించారు. వర్షం కాస్త తగ్గుముఖం పట్టిన తరువాత విమానం తిరిగి రేణిగుంటకు చేరుకుంది. అలాగే దిల్లీ నుంచి రేణిగుంటకు ఇటీవల ప్రారంభించిన ఇండిగో విమానం కూడా కాసేపు ఆకాశంలోనే చక్కర్లు కొట్టి దిగింది. మొత్తానికి ఇతర ప్రాంతాలనుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి విమానం ఆలస్యంగానే చేరుకున్నాయి. వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలం బుసిరెడ్డిపల్లె సమీపంలో వంకపై ఉన్న రహదారి కొట్టుకుపోయింది. తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాజ్‌వేలపై నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
కొట్టుకుపోయిన రహదారులు
వరదయ్యపాలెం పరిధి గోవర్ధనపురం వద్ద కాలువ వంతెనపై నీటి ప్రవాహం పెరగడంతో శ్రీకాళాహస్తి-తడ మార్గంలో రాకపోకలకు అంతరాయమేర్పడింది. రేణిగుంట-మామండూరు రహదారిలో చెట్లు కూలి ట్రాఫిక్ స్తంభించింది. ఎరుపేడు-మోదుగులపాలెం స్వర్ణముఖి నది కాజ్‌వేపై నీరు ప్రవహించడంతో అధికారులు రాకపోకలు నిలిపేశారు. తొట్టంబేడు మండలంలోని చట్టత్తూరు వాగుతోపాటు కారాకొల్లు సమీపంలోని కాజ్‌వేపై రాకపోకలు నిలిచాయి. శ్రీకాళాహస్తి మండలం నారాయణపురం పంచాయతీలోని ముల్లపూడి గిరిజన కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరింది. ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రామన్న చెరువు కట్ట తెగడంతో 216వ జాతీయరహదారిపైకి నీరు చేరింది. దీంతో చీరాల వైపు వెళ్లే వాహనాలను పాత బైపాస్ మీదుగా మళ్లించారు.
పంటలు జలార్పణం
ఒంగోలు మండలం కరవది-గుత్తికొండవారిపాలెం గ్రామాల మధ్య ఉన్న ముదిగొండ వాగు రెండు రోజులుగా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. విశాఖపట్టణంలోని ఇసుకతోట ప్రాంతం జలమయమైంది.ద్విచక్రవాహనాలు,కార్లు మునిగిపోయాయి. కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీరం కోతకు గురైంది. నెల్లూరు జిల్లాలోని చేజర్ల, అనంతసాగరం, విడవలూరు,ఎస్.ఆర్.పురం ప్రాంతాల్లో సుమారు 244 హెక్టార్లలో వేసిన వరి పంట నేలవాలింది. అన్నమయ్య జిల్లాలో టమాటకు ప్రస్తుతానికి నష్టం లేకపోయినప్పటికీ నీటి నిల్వ వల్ల వేరుకుళ్లు తెగులు వచ్చి దెబ్బతినే అవకాశముంది. ఇక్కడ నేల వాలిన వరిలో గింజలు మొలకెత్తాయి. వైఎస్సార్ జిల్లాలో 2,024 ఎకరాల్లో వరి,254 ఎకరాల్లో మినుముకు నష్టం వాటిల్లింది.ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. తిరుపతి జిల్లావ్యాప్తంగా 2,913 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. ప్రకాశం జిల్లాలో పొగాకు దెబ్బతింది.