
Road Collapse: సంగారెడ్డిలో భారీ వర్షాలు .. చెరువును తలపించిన NH-65 హైవే!
ఈ వార్తాకథనం ఏంటి
సంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. సదాశివపేట్ మండలంలోని నాగ్సన్‌పల్లి-నందికంది పెద్ద వాగు పొంగిపొర్లడంతో NH-65 జాతీయ రహదారి అర్ధరాత్రి చెరువులా మారిపోయింది. శిల్పా వెంచర్ నుంచి వచ్చిన వరద నీటితో హైవే పూర్తిగా ముంపునకు గురై, రాత్రంతా ఇరువైపులా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉదయం వరద నీరు తగ్గడంతో వాహనాలు నెమ్మదిగా కదలడం ప్రారంభించినా, రహదారి పక్కన ఉన్న పె ట్రోల్ బంకులు, హోటళ్లు, దాబాలు ఇంకా నీట మునిగిన పరిస్థితిలోనే ఉన్నాయి. ఇక కొండాపూర్ మండలంలో అర్ధరాత్రి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఫలితంగా చెరువులు పొంగిపొర్లి, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
Details
ఉగ్రరూపం దాల్చిన మంజీరా నది
సైదాపూర్ గ్రామ శివారులో వాగు ఉధృతికి రహదారి కొట్టుకుపోవడంతో సంగారెడ్డి నుంచి వికారాబాద్‌లోని మొమిన్‌పేట్, తాండూర్ వైపు రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. రోడ్డు తెగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక ఏడు పాయల ఆలయం ఎదుట మంజీరా నది మహోగ్రరూపం దాల్చింది. 15 రోజులుగా ఏడు పాయల వనదుర్గ భవానీ ఆలయం మూసివేశారు. సింగూర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో దిగువకు భారీ వరద చేరి, ఆలయ ప్రాంగణం పూర్తిగా మునిగిపోయింది. దీంతో, శరన్నవరాత్రి ఉత్సవాలను రాజగోపురంలోనే కొనసాగిస్తున్నారు. ఈ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరిదేవి రూపంలో దర్శనం ఇస్తున్నారు. అయితే ఆలయం ఎదుట మంజీరా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో భక్తులను ఎవ్వరినీ ఆ ప్రాంతానికి అధికారులు అనుమతించడం లేదు.