Page Loader
Heavy Rains: రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక

Heavy Rains: రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2025
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ మధ్య మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇదే సమయంలో తెలంగాణ మీదుగా ఉత్తరాంధ్ర తీరం దాకా విస్తరించిన ద్రోణి ప్రస్తుతం బలహీనపడినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. వర్షానికి తోడు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా విస్తరిస్తాయని అధికారులు తెలిపారు. నల్లగొండ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 38.5 డిగ్రీలుగా, మహబూబ్‌నగర్‌లో కనిష్టంగా 28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి.

Details

మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు

ఉత్తరాంధ్ర సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా వరకు, మరఠ్వాడ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు వేర్వేరు ఉపరితల ద్రోణులు కొనసాగుతున్నాయి. ఈ వాతావరణ స్థితిగతుల నేపథ్యంలో రాబోయే 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు,నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్న నేపథ్యంలో, సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలోకి వెళ్ళకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది.