Loading...
Kerala: కేరళను ముంచెత్తిన భారీవర్షాలు.. కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి
కేరళను ముంచెత్తిన భారీవర్షాలు.. కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి

Kerala: కేరళను ముంచెత్తిన భారీవర్షాలు.. కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2026
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో నాలుగేళ్ల బాలుడు సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇడుక్కి జిల్లాలో ఇద్దరు, కొట్టాయం జిల్లాలో తల్లీకొడుకులు కొండచరియల కింద చిక్కుకుని మృతి చెందగా, ఇతర ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండగా, పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆరు జిల్లాల్లోని డ్యాముల గేట్లను అధికారులు ఎత్తివేశారు.

వివరాలు

సహాయక చర్యలను ముమ్మరం చేసిన అధికారులు

వరదల ప్రభావంతో 183వ జాతీయ రహదారిపైకి కూడా నీరు చేరింది.

పంపా నది తీరంలోని అనేక ప్రాంతాలకు వరదల కారణంగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.

బాధితులను రక్షించేందుకు పడవల సహాయంతో సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.

వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేయడంతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు కూడా సెలవులు ప్రకటించారు.

వివరాలు

జమ్మూకశ్మీర్‌లో మేఘవిస్ఫోటం

మరోవైపు జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌లో శనివారం తెల్లవారుజామున మేఘవిస్ఫోటం (క్లౌడ్‌బర్స్ట్‌) సంభవించింది.

దీంతో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో అనేక ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

కిశ్త్‌వాడ్‌, డోడా, రామ్‌బన్‌ జిల్లాల్లో నదులు ఉప్పొంగి ప్రవహించడంతో పలు వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి.

పరిస్థితి తీవ్రంగా మారడంతో ఈ మూడు జిల్లాల్లోని పాఠశాలలను అధికారులు మూసివేశారు.

ADVERTISEMENT