Telangana: తెలంగాణలో మరో ఆరు రోజులు వర్షాల జోరు.. పలుజిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో వర్షాలు మరింత విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పలుచోట్ల వడగాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది.
వివరాలు
రాష్ట్రంలో వర్షాలు మరింత పెరిగే అవకాశం
మంగళవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతుండగా, రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
102 మండలాల్లో వడగాలులు
ఇక రాష్ట్రంలో ఆదివారం పలు ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం కనిపించింది. 10జిల్లాల పరిధిలోని 102 మండలాల్లో వడగాలులు నమోదయ్యాయి. వీటిలో 33 మండలాల్లో తీవ్రస్థాయి వడగాలులు వీచినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన వర్షాలతో పలు జిల్లాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లిలో అత్యధికంగా 7.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జనగామ జిల్లా జఫర్‌గఢ్‌లో 6.7 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బోడకొండలో 6.1 సెంటీమీటర్లు, వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పెద్యూముంతల్‌లో 5.4 సెంటీమీటర్లు నమోదయ్యాయి. అదే విధంగా సంగారెడ్డి జిల్లా ఝరాసంఘంలో 5.1 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా దామరచర్ల మండలం తిమ్మాపూర్‌లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.