
Extremely heavy rains: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. నేడు 15 జిల్లాలకు అతి భారీ వర్ష సూచన
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండం దిశగా పయనిస్తోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా 15 జిల్లాలకు శుక్రవారం ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హనుమకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు'ఆరెంజ్ అలర్ట్'జారీ చేసినట్టు వెల్లడించింది. ఇదిలా ఉండగా, మహారాష్ట్రలో కురుస్తున్న విపరీతమైన వర్షాల ప్రభావం వల్ల బాసర ప్రాంతంలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
వివరాలు
అప్రమత్తంగా ఉండాలి: సీఎం
నది నీటితో ఆలయానికి వెళ్లే దారంతా మునిగిపోయింది. దీంతో భక్తులు ఆలయ దర్శనానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, వాతావరణశాఖ ఇచ్చిన ఈ అంచనాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖలను అప్రమత్తం చేశారు. ''వచ్చే రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నివేదిక చెబుతోంది. అందుకని అన్ని జిల్లాల కలెక్టర్లు పరిస్థితిని సమీక్షించాలి. చెరువుల కట్టలను క్రమం తప్పకుండా పరిశీలించాలి. నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలి. వరద నీరు రోడ్లపై చేరకుండా, వాహనాలను ముందుగానే కాపాడేలా చర్యలు చేపట్టాలి. విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధతో అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా జరిగేలా చూడాలి'' అని సీఎం ఆదేశించారు.