LOADING...
Srisailam: హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలు.. 9 నుంచి ప్రారంభం
హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలు.. 9 నుంచి ప్రారంభం

Srisailam: హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలు.. 9 నుంచి ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 04, 2026
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలను ప్రారంభించేందుకు తెలంగాణ పర్యాటక శాఖ సిద్ధమవుతోంది. సోమశిల మీదుగా సాగే ఈ ప్రత్యేక యాత్రలో కృష్ణా నది, నల్లమల అడవుల అద్భుత సౌందర్యాన్ని గగనతలం నుంచి వీక్షించే అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థతో కలిసి పర్యాటక శాఖ ఏర్పాట్లు కొనసాగిస్తోంది. ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్ నియోజకవర్గాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే హెలీ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

వివరాలు

ఆలయాల్లో వీఐపీ దర్శనాల ఏర్పాటు

ఈ సేవలను ఈ నెల 9వ తేదీ నుంచే ప్రారంభించేలా సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ యాత్ర కోసం బెల్-407 మోడల్ హెలికాప్టర్‌ను వినియోగించనున్నారు. పర్యాటకుల కోసం ఒకరోజు, రెండు రోజుల ప్యాకేజీలను రూపొందించారు. ఒకరోజు ప్యాకేజీలో హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి సోమశిల, శ్రీశైలం క్షేత్రాల్లో వీఐపీ దర్శనాలు పూర్తి చేసుకుని సాయంత్రానికి తిరిగి నగరానికి చేరుకునే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఇక రెండు రోజుల ప్యాకేజీలో వసతి, భోజన సౌకర్యాలతో పాటు అన్ని ఆలయాల్లో వీఐపీ దర్శనాల ఏర్పాట్లు ఉంటాయి. ఒకరోజు పర్యటనకు రూ.1.10 లక్షలు, రెండు రోజుల పర్యటనకు రూ.1.40 లక్షలుగా ధరలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Advertisement