Madhya Pradesh: ఇక నుంచి మహిళలకు నెలకు రూ. 3వేలు.. సీఎం కీలక హామీ!
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు ఇది నిజంగా పండగలాంటి వార్త. ఇప్పటివరకు నెలకు రూ.1,250 అందుకుంటున్న మహిళలు ఇకపై నెలకు రూ.3,000 పొందనున్నారు.
ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్వయంగా ప్రకటించారు. 'లాడ్లీ బహనోం' యోజన కింద 1.27 కోట్ల మహిళల ఖాతాల్లో రూ.1,553 కోట్ల మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేసిన అనంతరం ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
దేవాస్ జిల్లాలోని పీపల్‌రవా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో సీఎం డాక్టర్ మోహన్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్రంలోని మహిళలు ఇకపై ఆర్థికంగా చింతించవసరంలేదని అన్నారు.
Details
గ్యాస్ సిలిండర్ కోసం రూ.450 చోప్పున సాయం
'లాడ్లీ బహనోం' పథకంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు.
కానీ తమ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయదని స్పష్టం చేశారు.
అదేవిధంగా రాష్ట్రంలోని 74 లక్షల మంది మహిళల ఖాతాల్లో ప్రతి నెలా గ్యాస్ సిలిండర్ ధర కోసం రూ.450 చొప్పున జమ చేస్తున్నామని తెలిపారు.
ఇప్పటివరకు మహిళలకు నెలకు రూ.1,250 అందించామని, దీన్ని రూ.3,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో సీఎం మోహన్ యాదవ్ 56 లక్షల సామాజిక భద్రతా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో రూ.337 కోట్లను, 81 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,624 కోట్లను ట్రాన్స్‌ఫర్ చేశారు.
అదనంగా, రూ.144.84 కోట్ల విలువైన 53 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.