LOADING...
Cyclone Montha : ఏపీకి హైఅలర్ట్.. దూసుకొస్తున్న మొంథా సైక్లోన్.. విద్యాసంస్థలకు సెలవులు! 
ఏపీకి హైఅలర్ట్.. దూసుకొస్తున్న మొంథా సైక్లోన్.. విద్యాసంస్థలకు సెలవులు!

Cyclone Montha : ఏపీకి హైఅలర్ట్.. దూసుకొస్తున్న మొంథా సైక్లోన్.. విద్యాసంస్థలకు సెలవులు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 26, 2025
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ - ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం నుంచి బలపడుతూ ఏపీవైపు (మొంథా) తుపానుగా మారింది. వాయుగుండం గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతూ, పోర్ట్‌బ్లెయిర్‌కి 510 కిమీ, విశాఖపట్టణం 920 కిమీ, చెన్నై 890 కిమీ, కాకినాడ 920 కిమీ, ఒడిశా గోపాల్‌పూర్‌ 1000 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపానం శక్తివంతంగా మారి, 28వ తేదీ ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది. అదే రోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు తీరాన్ని దాటే అవకాశముందని, బుధవారం ఉదయం వరకు తుపానం బలహీనపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

Details

ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు

తుపాన్తో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాల అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలోని జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేయబడింది. తీరాన్ని దాటినప్పుడు గరిష్ఠంగా 110 కిమీ/గంట వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మత్స్యకారులు ఈనెల 29వ తేదీ వరకు వేటకు వెళ్ళరాదు అని హెచ్చరించారు. విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణా, గంగవరం పోర్టుల్లో మొదటి హెచ్చరిక జారీ చేశారు.

Details

వర్షాలు పడే జిల్లాలు ఇవే

తుపాన్తో ఈరోజు (ఆదివారం) శ్రీపొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అత్యంత భారీ వర్షాల అవకాశం ఉంది. అలాగే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూల్, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు.

Details

వాతావరణ హెచ్చరికలు జారీ

మంగళవారం కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీపొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం,చిత్తూరు, అన్నమయ్య, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు. బుధవారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, విశాఖపట్టణం, అనకాపల్లి, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్నారు.