Loading...
CJP: దిల్లీలో హై అలర్ట్‌.. జంతర్‌ మంతర్‌ వద్ద భారీ భద్రత!
దిల్లీలో హై అలర్ట్‌.. జంతర్‌ మంతర్‌ వద్ద భారీ భద్రత!

CJP: దిల్లీలో హై అలర్ట్‌.. జంతర్‌ మంతర్‌ వద్ద భారీ భద్రత!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 11, 2026
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో శనివారం జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన చేపట్టేందుకు ప్రయత్నించిన కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. పోలీసుల అదుపులో ఉన్న అభిజిత్‌ దీప్కే (Dipke), సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రాంకాలను ఆదివారం దిల్లీ కంటోన్మెంట్‌ పోలీస్‌ స్టేషన్‌లోని ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం వారిని విడుదల చేయాలని మేజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని సీజేపీ నేత రత్నాసింగ్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

వివరాలు

రెండో రోజూ భారీ భద్రతా ఏర్పాట్లు

సీజేపీ ఇన్‌ఛార్జ్‌ అజింక్య శిందే ఆధ్వర్యంలో ఆదివారం కూడా జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలు కొనసాగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

వరుసగా రెండో రోజు ఆ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 30,000 మందికి పైగా పోలీసులు, పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు.

దిల్లీ సరిహద్దులతో పాటు రైల్వే స్టేషన్లు, బస్‌ టెర్మినళ్లు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను పెంచారు.

పరిస్థితులను అదుపులో ఉంచేందుకు దిల్లీ పోలీసులకు 120కి పైగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సహకరిస్తున్నాయి.

భద్రతా నిర్వహణను సులభతరం చేసేందుకు న్యూదిల్లీని 20 జోన్లుగా విభజించారు.

జాయింట్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, అదనపు డిప్యూటీ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

వివరాలు

జర్నలిస్టుల నిర్బంధంపై పాత్రికేయ సంఘాల ఆగ్రహం

నిరసనకారులు హోటళ్లు, గెస్ట్‌ హౌస్‌లు, లాడ్జీలు, ధర్మశాలల్లో ఆశ్రయం పొందకుండా భద్రతా బలగాలు అక్కడ తనిఖీలను ముమ్మరం చేశాయి. మరోవైపు, సోషల్‌ మీడియా వేదికలపైనా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

శనివారం దేశ రాజధానిలో జరిగిన నిరసనలను కవర్‌ చేస్తున్న పలువురు జర్నలిస్టులను పోలీసులు నిర్బంధించడం, వేధింపులకు గురిచేయడంపై ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా (PCI), ఇండియన్‌ ఉమెన్స్‌ ప్రెస్‌ కార్ప్స్‌ (IWPC) సహా నాలుగు పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

జర్నలిస్టులు తమ ప్రెస్‌ గుర్తింపు కార్డులను చూపించినప్పటికీ పోలీసులు వారిని నిర్బంధించారని ఆయా సంఘాలు పేర్కొన్నాయి.

ADVERTISEMENT

వివరాలు

పరికరాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

కొందరు రిపోర్టర్ల ఫోన్లు, ఇతర పరికరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించాయి.

పోలీసుల చర్యలను కవర్‌ చేస్తున్న జర్నలిస్టులను సైతం బస్సుల్లోకి ఎక్కించి వివిధ నిర్బంధ కేంద్రాలకు తరలించారని ఆరోపించాయి.

జర్నలిస్టుల పట్ల పోలీసుల వ్యవహారశైలిని పత్రికా స్వేచ్ఛపై జరిగిన దారుణమైన దాడిగా పాత్రికేయ సంఘాలు అభివర్ణించాయి.

నిర్బంధంలో ఉన్న జర్నలిస్టులందరినీ వెంటనే విడుదల చేయాలని, జరిగిన ఘటనకు దిల్లీ పోలీసులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశాయి.

ADVERTISEMENT