Loading...
Russia: టెస్ట్ ట్యూబ్ పగిలిందా? ప్లేగుతో శాస్త్రవేత్త మృతి.. తల్లి సంచలన వ్యాఖ్యలు
టెస్ట్ ట్యూబ్ పగిలిందా? ప్లేగుతో శాస్త్రవేత్త మృతి.. తల్లి సంచలన వ్యాఖ్యలు

Russia: టెస్ట్ ట్యూబ్ పగిలిందా? ప్లేగుతో శాస్త్రవేత్త మృతి.. తల్లి సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 10, 2026
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాకు చెందిన దర్యా షిపిలోవా అక్టోబర్ 2న మరణించడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇర్కుట్స్క్ యాంటీ ప్లేగు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్న సమయంలో ఆమె ప్రమాదవశాత్తూ ఓ టెస్ట్ ట్యూబ్‌ను పగలగొట్టారని, దాని ద్వారా న్యుమోనిక్ ప్లేగుకు కారణమయ్యే బ్యాక్టీరియా సోకిందని వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ కథనాలను దర్యా తల్లి స్వెత్లానా తీవ్రంగా ఖండించారు. శాస్త్రవేత్త అయిన స్వెత్లానా.. ప్రయోగశాలలో టెస్ట్ ట్యూబ్ పగిలి ప్రమాదకరమైన బ్యాక్టీరియా బయటకు వచ్చిందన్న వాదనను తాను నమ్మడం లేదని తెలిపారు. టెస్ట్ ట్యూబ్‌లను ఎంతో జాగ్రత్తగా, సురక్షితంగా రూపొందిస్తారని, వాటిని గోడకు విసిరినా అంత సులభంగా పగిలిపోవని ఆమె పేర్కొన్నారు. వాటిలోని పదార్థాలు బయటకు చిందిపోయే అవకాశం ఉందన్న కథనాలపై సందేహాలు వ్యక్తం చేశారు.

వివరాలు

'నా కుమార్తెను కాపాడేందుకు ఎవరూ పట్టించుకోలేదు'

తన కుమార్తె ప్రాణాలను కాపాడేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోలేదని స్వెత్లానా ఆవేదన వ్యక్తం చేశారు.

దర్యా మరణానికి సంబంధించి వెలువడుతున్న వార్తలపై ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, రష్యా అధికారులు మాత్రం ఆమె న్యుమోనిక్ ప్లేగుతో మరణించిందన్న వాదనలను తోసిపుచ్చారు.

దర్యా న్యుమోనియా కారణంగానే ప్రాణాలు కోల్పోయిందని చెబుతున్నారు. తొలుత _ది మాస్కో టైమ్స్_ పత్రిక సైబీరియాలో ప్రమాదకరమైన ప్లేగు రకం కారణంగా దర్యా మరణించినట్లు కథనం ప్రచురించింది.

ఆమెతో సన్నిహితంగా మెలిగిన సుమారు 200 మందికి పరీక్షలు నిర్వహించగా, ప్రమాదకరమైన అంటువ్యాధులకు కారణమయ్యే వ్యాధికారకాలు ఏవీ గుర్తించలేదని పేర్కొంది.

అనంతరం ఈ వ్యవహారంపై రష్యా అధికారులు స్పందించి వివరణ ఇచ్చారు.

వివరాలు

పుతిన్‌తో మాట్లాడిన ట్రంప్‌.. పరిస్థితిపై ఆరా

రష్యాలో ప్లేగు వ్యాప్తి చెందుతోందన్న వార్తలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగించాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

పరిస్థితి అదుపులోనే ఉందని పుతిన్‌ హామీ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు రష్యా పొరుగు దేశాలైన మంగోలియా, కిర్గిజిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ తమ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాయి.

రష్యాలో ప్లేగు వ్యాప్తి చెందుతోందన్న వార్తల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు

అసలు కారణం ఏమిటి?

దర్యా షిపిలోవా మరణానికి గల అసలు కారణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది.

ఆమె తల్లి ప్రయోగశాల ప్రమాదం, అధికారుల నిర్లక్ష్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, రష్యా ప్రభుత్వం మాత్రం ప్లేగు వ్యాప్తి వార్తలను ఖండిస్తోంది.

దర్యా న్యుమోనియాతోనే మరణించిందని అధికారులు చెబుతున్నారు. ఈ పరస్పర విరుద్ధ వాదనల నేపథ్యంలో ఆమె మరణానికి సంబంధించిన వాస్తవాలు ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT