Loading...
IPL 2027-CSK: ఐపీఎల్‌ 2027కు ముందే సీఎస్‌కేలో ప్రక్షాళన.. మరో కీలక కోచ్‌కు ఉద్వాసన!
ఐపీఎల్‌ 2027కు ముందే సీఎస్‌కేలో ప్రక్షాళన.. మరో కీలక కోచ్‌కు ఉద్వాసన!

IPL 2027-CSK: ఐపీఎల్‌ 2027కు ముందే సీఎస్‌కేలో ప్రక్షాళన.. మరో కీలక కోచ్‌కు ఉద్వాసన!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 10, 2026
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందే చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జట్టు ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే హెడ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్‌ను నియమించిన యాజమాన్యం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా కాలంగా జట్టు బ్యాటింగ్‌ కోచ్‌గా సేవలందిస్తున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మైఖేల్‌ హస్సీతో సీఎస్‌కే బంధం ముగిసినట్లు సమాచారం. దీంతో చెన్నై జట్టు కోచింగ్‌ సిబ్బందిలో చోటుచేసుకుంటున్న మార్పులు క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

వివరాలు

హస్సీకి సమాచారం ఇచ్చిన సీఎస్‌కే యాజమాన్యం

క్రిక్‌బజ్‌ కథనం ప్రకారం.. మైఖేల్‌ హస్సీని తమ నిర్ణయం గురించి సీఎస్‌కే యాజమాన్యం అధికారికంగా సమాచారం అందించింది.

దీంతో ఐపీఎల్‌ 2027లో హస్సీ మరో ఫ్రాంచైజీ తరఫున కోచింగ్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇప్పటికే కొన్ని జట్లతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై హస్సీ నుంచి గానీ, సంబంధిత ఫ్రాంచైజీల నుంచి గానీ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

వివరాలు

ఇప్పటికే పలువురు కోచ్‌లకు వీడ్కోలు?

సీఎస్‌కే కోచింగ్‌ విభాగంలో ఇప్పటికే పలు మార్పులు చోటుచేసుకున్నాయి. 18 ఏళ్ల పాటు జట్టుకు హెడ్‌ కోచ్‌గా సేవలందించిన స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌తో ఆ ఫ్రాంచైజీ విడిపోయినట్లు సమాచారం.

అలాగే బౌలింగ్‌ కోచ్‌ ఎరిక్‌ సిమన్స్‌ కూడా జట్టును వీడినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఫీల్డింగ్‌ కోచ్‌ జేమ్స్‌ ఫోస్టర్‌ భవిష్యత్తుపైనా అనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే జహీర్‌ ఖాన్‌ను హెడ్‌ కోచ్‌గా నియమించిన సీఎస్‌కే.. మాజీ పేసర్‌ మోహిత్‌ శర్మకు బౌలింగ్‌ కోచ్‌ బాధ్యతలు అప్పగించింది.

ఇప్పుడు మైఖేల్‌ హస్సీ కూడా జట్టును వీడనున్నారనే వార్తల నేపథ్యంలో కొత్త బ్యాటింగ్‌ కోచ్‌ ఎవరనే అంశంపై ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT

వివనాలే

సీఎస్‌కేతో 15 ఏళ్లకు పైగా అనుబంధం

మైఖేల్‌ హస్సీకి చెన్నై సూపర్‌ కింగ్స్‌తో 15 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. ఆటగాడిగా, కోచ్‌గా ఆయన జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.

ఆటగాడిగా సీఎస్‌కేతో కలిసి రెండు ఐపీఎల్‌ టైటిళ్లు గెలుచుకున్న హస్సీ.. కోచింగ్‌ బృందంలో భాగంగా మరో మూడు టైటిళ్ల విజయాల్లో పాలుపంచుకున్నారు.

ముఖ్యంగా సీఎస్‌కే ప్రారంభ సంవత్సరాల్లో బ్యాటర్‌గా తనదైన ముద్ర వేసిన ఆయన.. జట్టు విజయాలకు విలువైన సహకారం అందించారు.

2013 ఐపీఎల్‌ సీజన్‌లో ఏకంగా 733 పరుగులు సాధించి అద్భుతంగా రాణించారు.

ADVERTISEMENT

వివరాలు

కొత్త కోచింగ్‌ బృందంతో సీఎస్‌కే ఎలా?

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. 2027 సీజన్‌కు ముందు కోచింగ్‌ విభాగాన్ని పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

వరుసగా కీలక కోచ్‌ల మార్పులతో కొత్త బృందం ఎలా రూపుదిద్దుకుంటుంది? బ్యాటింగ్‌ కోచ్‌గా ఎవరిని ఎంపిక చేస్తారు? కొత్త సిబ్బందితో సీఎస్‌కే వచ్చే సీజన్‌కు ఎలా సిద్ధమవుతుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT