Siddaramaiah: రాజ్యసభ సీటుకు నో.. రాష్ట్ర రాజకీయాలలోనే కొనసాగుతా: సిద్ధరామయ్య
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ అధిష్ఠానం తనకు రాజ్యసభ సభ్యత్వాన్ని ప్రతిపాదించినప్పటికీ, తాను ఆ అవకాశాన్ని మర్యాదపూర్వకంగా తిరస్కరించానని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం తనకు లేదని, ఎమ్మెల్యేగా కొనసాగుతూ రాష్ట్ర రాజకీయాల్లోనే చురుకుగా పనిచేస్తానని స్పష్టం చేశారు. గురువారం మధ్యాహ్నం బెంగళూరులోని లోక్ భవన్‌కు చేరుకున్న సిద్ధరామయ్య తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ వ్యక్తిగత కార్యక్రమాల నిమిత్తం ఇండోర్‌లో ఉండటంతో ఆయన అందుబాటులో లేకపోయారు. దీంతో గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభు శంకర్‌కు సిద్ధరామయ్య రాజీనామా లేఖను అందజేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు పలువురు మంత్రులు ఆయన వెంట ఉన్నారు.
వివరాలు
కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు తదుపరి సీఎంగా డీకే శివకుమార్
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ముందు తన నివాసంలో కేబినెట్ సభ్యులకు సిద్ధరామయ్య అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధిష్ఠానం సూచనల మేరకు తాను పదవి నుంచి తప్పుకుంటున్నానని మంత్రులకు తెలియజేశారు. అనంతరం డీకే శివకుమార్ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించారు. సిద్ధరామయ్య సమర్పించిన రాజీనామా పత్రాన్ని స్వీకరించినట్లు గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభు శంకర్ మీడియాకు తెలిపారు. దీనిపై గవర్నర్ తుది నిర్ణయం తీసుకుని అధికారికంగా ఆమోదం ప్రకటించే అవకాశం ఉందన్నారు.