Ap high court: పీపీపీ విధానంలో ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం.. అందులో న్యాయస్థానాల జోక్యం పరిమితమైంది
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలో పది కొత్త వైద్య కళాశాలలు,వాటికి అనుబంధ ఆసుపత్రులను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో (పీపీపీ మోడల్) నిర్మించి నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. టెండర్ ప్రక్రియను అడ్డుకోవడం లేదా మూడో పక్షాలకు హక్కులు ఇచ్చే విధానాన్ని నిలిపివేయడం తమ పరిధిలో లేదని ధర్మాసనం పేర్కొంది. పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు, ఆసుపత్రులు ఏర్పాటు చేయడం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇలాంటి అంశాలలో న్యాయస్థాన జోక్యం చాలా పరిమితమైందని కోర్టు వివరించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని నిరూపితమైతే తప్ప తాము జోక్యం చేసుకోలేమని స్పష్టంగా పేర్కొంది. ప్రస్తుతం టెండర్ ప్రక్రియ కొనసాగుతున్న దశలో ఉండటంతో, దానిని నిలిపివేయడం సరికాదని వ్యాఖ్యానించింది.
వివరాలు
విచారణ మరో నాలుగు వారాలపాటు వాయిదా
పీపీపీ విధానం ఎందుకు ఎంచుకుంది? దీని వల్ల లాభనష్టాలు ఏమిటి? అన్న అంశాలను కూడా సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. ఇంకా టెండర్ ప్రక్రియ ప్రారంభ దశలోనే ఉందని, ప్రభుత్వం ఆహ్వానం ఇవ్వగానే పెట్టుబడిదారులు వెంటనే డబ్బు సంచులతో పరుగులు తీసి రావడం అనుకోవడం తగదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ సమర్పించేందుకు కొంత సమయం ఇస్తూ, విచారణను మరో నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
వివరాలు
వైద్య కళాశాలలు,ఆసుపత్రులు నిర్మిస్తే పేదలకు ఉచిత వైద్య సేవలు దూరమయ్యే అవకాశం
అదేవిధంగా,ఆదోని,మదనపల్లె,మార్కాపురం,పులివెందుల,పెనుగొండ,పాలకొల్లు,అమలాపురం, నర్సీపట్నం,బాపట్ల,పార్వతీపురం ప్రాంతాల్లో వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ 9న జారీ చేసిన జీవో 590పై గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన డాక్టర్ కుర్రా వసుంధర హైకోర్టులో పిల్ వేశారు. ఈ పిల్‌పై జరిగిన విచారణలో ఇటీవల ధర్మాసనం"వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో నిర్మిస్తే తప్పేంటి?"అని ప్రశ్నించిన విషయం తెలిసిందే. అదే కేసుపై బుధవారం తిరిగి విచారణ జరిపిన కోర్టు,పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరామ్,న్యాయవాది అశోక్‌రామ్‌ల వాదనలు విన్నది. వారు వాదిస్తూ,పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు,ఆసుపత్రులు నిర్మిస్తే పేదలకు ఉచిత వైద్య సేవలు దూరమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే మూడో పక్షానికి హక్కులు ఇవ్వకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
వివరాలు
17 కళాశాలలకు రూ.8,500 కోట్ల ఖర్చు
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. "ప్రస్తుతం ఎన్ని వైద్య కళాశాలలు నిర్మాణ దశలో ఉన్నాయి? వాటి పనులు ఎంతవరకు పూర్తయ్యాయి? ఖర్చు ఎంత అవుతుంది?" అని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.ప్రణతి సమాధానమిస్తూ, రాష్ట్రంలో మొత్తం 17 వైద్య కళాశాలల్లో పులివెందుల కళాశాల మాత్రమే 80 శాతం పూర్తయిందని తెలిపారు. ఆ కళాశాలకు అనుబంధ ఆసుపత్రి లేకపోవడం వల్ల ఎన్‌ఎంసీ సీట్లు కేటాయించలేదని తెలిపారు. మిగతా కళాశాలల పనులు 20 నుండి 30 శాతం వరకే పూర్తయ్యాయని వివరించారు. ఒక్కో వైద్య కళాశాల,దాని అనుబంధ ఆసుపత్రి నిర్మాణానికి సుమారు రూ.500 కోట్లు వ్యయం అవుతుందని, మొత్తం 17 కళాశాలలకు రూ.8,500 కోట్ల ఖర్చు వస్తుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.