High Court: 25 శాతం ఉచిత కోటా కింద మహిళకు చికిత్స అందించాలి.. బసవతారకం ఆస్పత్రికి హైకోర్టు ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వం జారీ చేసిన జీవోల నిబంధనలను అమలు చేస్తూ జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన బాలె భాగ్యమ్మకు వెంటనే క్యాన్సర్ చికిత్స అందించాలని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. 25శాతం ఉచిత ఇన్‌పేషెంట్ కోటా కింద చికిత్స ఇవ్వడానికి ఆస్పత్రి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ భాగ్యమ్మ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. 1989లో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.434 ప్రకారం బసవతారకం ఆస్పత్రికి 7.35 ఎకరాల భూమిని లీజుకు ఇచ్చిందని కోర్టుకు వివరించారు.
వివరాలు
వైద్య ఆరోగ్యశాఖ 2022లో జీవో నెం.80 జారీ
ఆ భూమిని కేటాయించినప్పుడు ఆస్పత్రిలో 25 శాతం ఇన్‌పేషెంట్, 40శాతం ఔట్‌పేషెంట్ సేవలను పేదలకు పూర్తిగా ఉచితంగా అందించాలనే స్పష్టమైన షరతు విధించిందని తెలిపారు.
అలాగే, ఈ ఉచిత వైద్య సేవల అమలును పర్యవేక్షించేందుకు వైద్య ఆరోగ్యశాఖ 2022లో జీవో నెం.80 జారీ చేసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
అయినప్పటికీ, ఆయా జీవోల్లోని నిబంధనలకు అనుగుణంగా ఉచిత చికిత్స అందించాలని భాగ్యమ్మ చేసిన విజ్ఞప్తిని ఆస్పత్రి తిరస్కరించిందని, దీంతో న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వాదించారు.
వివరాలు
బాధిత మహిళకు అందుతున్న చికిత్సను డీఎంహెచ్‌ఓ పర్యవేక్షించాలి
ఇరు పక్షాల వాదనలు పరిశీలించిన న్యాయమూర్తి, పిటిషనర్‌ను వెంటనే ఆస్పత్రిలో చేర్చుకుని 25 శాతం ఉచిత ఇన్‌పేషెంట్ కోటా కింద క్యాన్సర్‌కు అవసరమైన వైద్యం అందించాలని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
అదేవిధంగా, బాధిత మహిళకు అందుతున్న చికిత్సను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) పర్యవేక్షించాలని ఆదేశించారు.
అలాగే, ఆస్పత్రిలో 25 శాతం ఉచిత చికిత్స కోటా అమలుపై సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించాలని డీఎంహెచ్‌ఓకు సూచిస్తూ కేసు తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు.