Abhijit Deepke: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హైడ్రామా.. విమానం లోపలే అభిజీత్ దీప్కే అరెస్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. అయితే విమానం నుంచి దిగకముందే పోలీసులు లోపలికి వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను అభిజీత్ దీప్కే తన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ద్వారా ప్రసారం చేశారు. ఆయనతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను కూడా విమానంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానంలోకి పోలీసులు ప్రవేశించిన దృశ్యాలను దీప్కే వీడియోగా పోస్ట్ చేశారు. ఆ వీడియోలో విమానం లోపల కొంత గందరగోళం కనిపించింది.
వివరాలు
ఇళ్ల వద్దే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం
ప్రయాణికులు దిగిన తర్వాత అరెస్ట్ చేయవచ్చు కదా? అంటూ కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు పోలీసులను ప్రశ్నించారు. మహిళా పోలీసులతో అభిజీత్ దీప్కే వాగ్వాదానికి దిగుతూ.."మేం విమానం నుంచి బయటకు వచ్చే వరకు వేచి ఉండాల్సింది.
వచ్చి అరెస్ట్ చేయండి.. మేం భయపడటం లేదని వ్యాఖ్యానించారు. అంతకుముందు శనివారం ఉదయం అభిజీత్ దీప్కే ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరారు.
జంతర్ మంతర్ వద్ద ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరగనున్న నిరసనకు ఆయన నాయకత్వం వహించాల్సి ఉంది.
మరోవైపు నిరసనలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, కాక్రోచ్ జనతా పార్టీ లీగల్ సెల్ హెడ్ రత్నా సింగ్‌లను కూడా ఢిల్లీ పోలీసులు వారి ఇళ్ల వద్దే అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు
400మందికి పైగా అదుపులోకి
అంతేకాకుండా శనివారం తెల్లవారుజామున రాజధానిలోని వివిధ ప్రాంతాల నుంచి నిరసనల్లో పాల్గొనే అవకాశం ఉందని అనుమానించిన 400 మందికి పైగా వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శుక్రవారం కూడా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ముందస్తుగా తగిన సమయం ఉండేలా అనుమతి కోసం దరఖాస్తు చేసుకోలేదని పోలీసులు కారణం తెలిపారు.
నిరసనకారుల కదలికలను నియంత్రించేందుకు ఢిల్లీలో ఆంక్షలు విధించారు. నగరంలో 45 మెట్రో స్టేషన్లను మూసివేయడంతో పాటు, నిరసనకారులు ప్రయాణించకుండా అడ్డుకునేందుకు డజన్ల కొద్దీ రైళ్లను రద్దు చేశారు.