అధిక పెన్షన్: బకాయిలను మళ్లించడానికి 3నెలల కాలపరిమితిని విధించిన ఈపీఎఫ్ఓ
అధిక పింఛన్ ఎంచుకున్న వారికి సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) కీలక సర్క్యులర్‌ను జారీ చేసింది. అధిక పెన్షన్‌ను ఎంచుకునే వారికి ఈపీఎస్ కంట్రిబ్యూషన్‌లను ఎలా లెక్కించాలో ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉంటే, బకాయిలు ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) ఖాతాకు బదిలీ చేయబడతాయి. అయితే, లోటు ఉంటే, పెన్షనర్ లేదా ఉద్యోగి వారి బ్యాంకు ఖాతా నుంచి చెల్లించాలి. ఈ అదనపు బకాయిల మళ్లింపు కోసం పెన్షనర్లు డిపాజిట్ చేయడానికి, సమ్మతి తెలియజేయడానికి 3 నెలల వరకు సమయం ఇవ్వవచ్చని ఈపీఎఫ్ఓ పేర్కొంది. బకాయిలను జమ చేయడానికి మూడు నెలల వ్యవధి సరిపోతుందా? అంటే యంత్రాంగంపై ఆధారపడి ఉంటుందని ఉద్యోగులు చెబుతున్నారు.
1.16% అదనపు చందాను జమ చేయాలి: ఈపీఎఫ్ఓ
జాయింట్ ఆప్షన్లు అర్హత ఉన్న ఖాతాల విషయంలో నెలకు రూ. 15,000 కంటే ఎక్కువ చెల్లింపుపై 1.16% అదనపు చందాను అందించాలని ఈపీఎఫ్ఓ నూతన సర్క్యులర్‌లో పేర్కొంది. గతంలో అధిక వేతనంపై చందాను పెన్షన్ ఫండ్‌లో కాకుండా ప్రావిడెంట్ ఫండ్‌లో యజమానులు జమ చేశారు. ఇలాంటి కేసుల్లో యజమాని వాటా నుంచి 8.33శాతాన్ని పింఛను నిధికి సర్దుబాట్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ సర్వీస్‌లో ఉన్న సభ్యుల ఉమ్మడి ఆప్షన్లు ఆమోదించినట్లయితే ప్రస్తుత యజమాని నెలకు రూ. 15,000 కంటే ఎక్కువ వేతనాలపై పెరిగిన 1.16%తో సహా భవిష్యత్తులో కూడా అధిక వేతనాలపై పెన్షన్ కంట్రిబ్యూషన్‌ను చెల్లించడం కొనసాగించాలి.