
Working Age Population: అత్యధిక పని-వయస్సు జనాభా నిష్పత్తిలో దిల్లీ ముందంజ.. ఆ తర్వాత తెలంగాణ,ఆంధ్రప్రదేశ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనగల వయసున్న (15-59 ఏళ్లు) వ్యక్తుల శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో దిల్లీ టాప్‌లో నిలిచింది. కొత్తగా విడుదలైన సాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ స్టాటిస్టికల్ రిపోర్ట్-2023 ప్రకారం,దేశ రాజధాని జనాభాలో ఈ వయసుగల వారిలో 70.8 శాతం ఉన్నట్టు వెల్లడైంది. మొత్తం దేశంలో ఈ వయసుగల వారి భాగస్వామ్యం సుమారు 66 శాతంగా ఉంది. తెలంగాణలో 15-59ఏళ్ల మధ్య వయసున్న వారి వాటా 70.2 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ 70.1 శాతంతో మూడో స్థానంలో ఉంది. వీటి తో పాటు,దేశ జనాభాలో 0-14 ఏళ్ల వయసున్న చిన్నారుల సంఖ్య తక్కువవుతోందని గణాంకాలు చెబుతున్నాయి.
వివరాలు
చివరి స్థానంలో బిహార్
1971లో వీరి శాతం 41%గా ఉండగా, 2023 నాటికి ఇది 24%కు తగ్గింది. అయితే, బిహార్ రాష్ట్రంలో 14 ఏళ్ల లోపు పిల్లల శాతం అత్యధికంగా 32 శాతంగా ఉంది. అయితే, 15-59 ఏళ్ల వయసున్న వర్కింగ్ ఏజ్ జనాభా పరంగా బిహార్ చివరి స్థానంలో ఉంది, ఇది ప్రత్యేకంగా గమనించదగ్గ విషయం. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల మధ్య జనాభా వయసు పరంగా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. అర్బన్ ప్రాంతాల్లో 15-59 ఏళ్ల మధ్య వయసున్న వారి శాతం 68.6%, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 64.6%. 15 ఏళ్ల లోపు చిన్నారుల శాతం గ్రామీణ ప్రాంతాల్లో 25.9%, అర్బన్ ప్రాంతాల్లో కూడా అదే 25.9%గా ఉంది.
వివరాలు
60 ఏళ్ల పైబడిన వృద్ధుల శాతం దేశంలో 9.7%
60 ఏళ్ల పైబడిన వృద్ధుల శాతం దేశంలో 9.7%. ఇందులో మహిళల శాతం 10.2%, పురుషుల శాతం 9.2%. కేరళలో వృద్ధుల శాతం అత్యధికంగా 15.1%గా ఉంది. దానికి తక్కువగా తమిళనాడు (14%) హిమాచల్ ప్రదేశ్ (13.2%) ఉన్నాయి. ఝార్ఖండ్, అస్సాం, దీల్‌హీ రాష్ట్రాల్లో వృద్ధుల శాతం అత్యల్పంగా, సుమారు 7.6-7.7% ఉంది. జనాభాలో లింగ వ్యత్యాసాలు కూడా స్పష్టంగా కనిపించాయి. 15-59 ఏళ్లు, 60 ఏళ్ల పైబడిన వారు, 15-64 ఏళ్ల వయసు గల వారి సంఖ్యలో మహిళల శాతం ఎక్కువగా ఉంది. కేవలం అస్సాం, జమ్మూ అండ్ కశ్మీర్ రాష్ట్రాలలో మాత్రమే వృద్ధులలో పురుషుల శాతం ఎక్కువగా ఉంది.